చిక్కడపల్లి, మే10(ఆంధ్రజ్యోతి): సమాజాన్ని సంస్కరించేదే కవిత్వం అని వక్తలు అన్నారు.  కమలాకర లలిత కళాభారతి ఆధ్వర్యం లో శుక్రవారం రాత్రి త్యాగరాయగానసభలో కవయిత్రుల కవి సమ్మేళనం జరిగింది. రత్నామహీధర్‌, సత్య, తమిరిశ జానకి, అత్తలూరి విజయలక్ష్మి, చంద్రిక, లలితా పరమేశ్వరి, పరిమళా సోమేశ్వర్‌, పల్లి లక్ష్మి తదితరులు వివిధ అంశాలపై కవితలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో కవయిత్రి స్వాతి శ్రీపాద ముఖ్య అతిథిగా పాల్గొనగా పరిమళా పరమేశ్వర్‌, రచయిత్రి కేబీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. కొత్తగా కవిత్వం రాసేవారు సీనియర్‌ కవుల రచనలను చదవాలన్నారు. రవి కాంచని చోటును కవి కాంచుననే నానుడిని సార్థకం చేస్తూ ప్రజాసమస్యలను వెలుగులోకి తేవాలని అన్నారు. ఈ సమావేశంలో నిర్వాహకురాలు భారతీ కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.