పోలీస్‌ స్టేషన్‌లో రైటర్స్‌ ఉంటారు. కేసు నమోదు చేసుకోవడం వాళ్ల డ్యూటీ. మహా అయితే స్టేషన్‌కో రైటర్‌ ఉంటాడేమో! ఈ మధ్య కర్ణాటక ఠాణాల్లో రైటర్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఈ రైటర్లు కేసులు రాసే రకం కాదు! మనసులో పెల్లుబికిన భావాలను అక్షరబద్ధం చేస్తున్న రచయితలు వీళ్లు. ఖాకీలకు కాఠిన్యం, లాఠిన్యం మాత్రమే కాదు కవిత్వం కూడా వచ్చని నిరూపిస్తున్నారు. ఈ పోలీసులు కవులుగా మారడం వెనుక కారణం కూడా ఒక పోలీసే! ఆయన పేరు డి.సి.రాజప్ప. వృత్తి రీత్యా పోలీస్‌. ప్రవృత్తి రీత్యా కవి.

అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. పండితుడు, పామరుడు, పోలీసు... కారెవరూ కవిత్వం చెప్పడానికి అనర్హులు అంటున్నాడు రాజప్ప. బెంగళూరు నగరంలో ఈయన జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌. ఆయనంటే అటు డిపార్ట్‌మెంట్‌లో అందరికీ గౌరవం. ఎందుకంటే.. రాజప్ప మంచి కవి. అద్భుతమైన భావుకతతో కవితలు రాస్తాడు. కళ్ల ముందు కదలాడిన దృశ్యాలను తన కవితల ద్వారా హృద్యంగా వర్ణిస్తాడు. అందుకే ఆయన అందరికీ ప్రత్యేకం.

 
అలా బయటపడ్డాడు
కాలేజీ రోజుల నుంచే రాజప్పలో కవి ఉన్నాడు. ఖాకీ ఒంటి మీదికి వచ్చాక.. ఆ కవి కాస్తా ఎక్కడో దాక్కుండిపోయాడు. ఒక రోజు ‘కన్నడ కంఠీరవ’గా పేరొందిన మహానటుడు రాజ్‌కుమార్‌కు... ఒక కవిత వినిపించాలని అనుకున్నాడట రాజప్ప. కానీ, అక్కడే ఉన్న సహోద్యోగులు పక్కకు తప్పుకోమన్నారట. ఆ సంఘటన అతణ్ణి ఎంతో కలచివేసింది. తనలోని కవిని అందరికీ పరిచయం చేయాలనుకున్నాడు. రోజూ కవితలు రాయడం మొదలుపెట్టాడు. అలా రాసిన కవితల్లో మేలైన వాటిని ఎంచుకొని 2002లో ఒక కవితా సంపుటిని ఆవిష్కరించాడు. అలా రాజప్పలోని సృజనాత్మకత డిపార్ట్‌మెంట్‌ అంతా తెలిసిపోయింది. పై అధికారులు అభినందించారు. ఆయన కింద పనిచేసేవారు.. ‘వన్స్‌మోర్‌ సార్‌’ అని ఎంకరేజ్‌ చేశారు.
 
ఒత్తిడి తగ్గించే మంత్రం
ఇక్కడితో ఆగిపోలేదు రాజప్ప కవిత్వం. ఆయన కింద పనిచేస్తున్న కానిస్టేబుళ్లు కూడా కవితలు రాయడం మొదలుపెట్టారు. రాజప్ప వారిని మరింత ప్రోత్సహించాడు. తన స్టేషన్‌లో మాత్రమే కాదు.. తూర్పు కర్ణాటక ప్రాంతంలోని బళ్లారి, షిమోగా, దేవనగరి, చిత్రదుర్గ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లకు కూడా సమాచారం అందించాడు రాజప్ప. అందమైన కవితలు రాయాలని పిలుపునిచ్చాడు. కవితలు రాయడం వల్ల పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. నెల రోజులు తిరిగే సరికి.. ఖాకీ వనంలో కవితా కుసుమాలు విరబూశాయు. దాదాపు 300 మంది కానిస్టేబుళ్లు అందమైన కవితలు రాసి రాజప్పకు పంపించారు. వాటిలో 52 కవితలను ఎంపిక చేసి ఒక కవితా సంపుటిని విడుదల చేశాడు రాజప్ప. మరుసటి ఏడాది మరో 52 కవితలతో మరో సంపుటిని అచ్చువేయించాడు. అంతేకాదు ‘పోలీసు సాహిత్య వేదిక’ పేరుతో ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు. పోలీసుల్లో కవితా శక్తిని ప్రేరేపించడమే ఈ సంఘం లక్ష్యం. రాజప్ప చేస్తున్న సాహితీ సేవను ఆ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. ఇది ఇలాగే కొనసాగాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఖాకీ కవిని మనమూ అభినందిద్దాం!