చిక్కడపల్లి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): సీని యర్‌ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, ఆంధ్ర సాహిత్య-సాంస్కృతిక ఉద్యమ నిర్మాత, బహుగ్రంథకర్త, పరిపాలనాదక్షుడు దేవులపల్లి రామానుజరావు అని వక్తలు పేర్కొన్నారు. త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గానసభలో దేవులపల్లి రామానుజరావు 26వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావును సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు రమణ వెలమకన్ని, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి పాల్గొన్నారు. రమణ వెలమకన్ని మాట్లాడుతూ దేవులపల్లి ఉస్మానియా యూనివర్సిటీకి సిండికేట్‌, సెనేట్‌ సభ్యుడిగా దీర్ఘకాలం, మూడు పర్యాయాలు తాత్కాలిక ఉప కులపతిగా సేవలందించిన విద్యావేత్త అని అన్నారు. ఆంధ్రసాహిత్య పరిషత్తు (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) స్థాపనకు, అభివృద్ధికి విశేష కృషి చేసిన కార్యసాధకుడు అన్నారు. 20 గ్రంథాలు వెలువరిస్తే వాటిలో సారస్వత నవనీతము ఆయనలోని తులనాత్మక విమర్శనాశక్తికి దర్పణంగాను, పచ్చతోరణం ఖండకావ్యం ఆయన భావుకతకు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు.

దాశరథి, మునిమాణిక్యం, గుంటూరు శేషేంద్రశర్మ, సినారె వంటి సాహిత్య స్రష్టల గ్రంథాలను అంకితం పుచ్చుకున్న ప్రతిభావంతుడని, గ్రంథాలయ ఉద్యమం, కోఆపరేటివ్‌ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారని, 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని అన్నారు. ఏపీ సారస్వత విద్యాలయంనుంచి డాక్టరేటు గ్రహీత అన్నారు. ఈ సమావేశంలో గానసభ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాస్‌, గాయకుడు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.