రవీంద్రభారతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): శాస్త్రీయ కళలు మన సంస్కృతికి నిదర్శనమని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలచారి అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో నృత్య కిన్నెర 34వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న వేణుగోపాలచారి, నాట్య గురువు ఉషాగాయత్రిని సత్కరించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య పోకడలో మన సంస్కృతిని మరిచిపోతున్న ఈ కాలంలో విద్యార్థులకు శాస్త్రీయ నాట్య బోధన చేయడం అభినందనీయమని అన్నారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీక అయిన శాస్త్రీయ కళలను కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. 34ఏళ్లుగా సంస్థను ముందుకు నడిపించడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు పాలకుర్తి మధుసూదనరావు, ఓలేటి పార్వతీశం, కామిశెట్టి శ్రీనివాసులు, ఆర్‌.ప్రభాకరరావు, మద్దాళి రఘురాం పాల్గొన్నారు. సభకు ముందు నాట్య గురువు ఉషాగాయత్రి శిష్యబృందం ‘వాగ్గేయకార వైభవం’ శీర్షికన నృత్య విభావరిలో కళాకారులు అలరించారు.