న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలకూ, రచయితలకూ మధ్య వారధిలా పనిచేసే ప్రచురణ కర్తలే ఈ దేశానికి నిజమైన సాంస్కృతిక రాయబారులని ఎమెస్కో పబ్లిషింగ్‌ హౌజ్‌ అధినేత ధూపాటి విజయకుమార్‌ అన్నారు. సాహిత్య రంగంలో ప్రచురణ కర్తల పాత్ర అన్న అంశంపై శనివారం కేంద్ర సాహిత్య అకాడ మీ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఒక దేశంలో ప్రచురించే పుస్తకాలను బట్టి ఆ దేశ సాంస్కృతిక ప్రమాణాలు, ప్రజల జీవన స్థితిగతులు తెలుస్తాయని అన్నారు. భారతీయ సాంస్కృతిక విలువలను తెలిపినవి రామాయణ, మహాభారత తదితర ఇతిహాసాలేనన్న విషయం మరిచిపోరాదన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, అక్కడి సామాజిక ఉద్యమాల గురించి ఇతర ప్రాంతాలకు తెలియాలంటే అక్కడి పుస్తకాల అనువాదాలు అవసరమని అన్నారు. సాహిత్య అకాడమీ జాతీయస్థాయిలో ప్రచురణ కర్తల సమ్మేళనం ఏర్పాటుచేసి అనువాదాల ప్రచురణలకు ఒప్పందాలు కుదుర్చాలని చెప్పారు. ప్రచురణ కర్తల్లో సగం మంది వ్యక్తులుగానే ఉన్నారని సంస్థలుగా మారిన ప్రచురణ కర్తలు తక్కువేనన్నారు. కేవలం సాహిత్యం ప్రచురించి ఆదాయం గడించే శక్తి ప్రచురణ కర్తలకు లేదని, వారు విద్య, ఇతర అంశాలకు చెందిన పుస్తకాలను ప్రచురించాల్సిందేనని, మార్కెట్‌ ప్రచురణల స్థాయిని నిర్దేశిస్తుందని చెప్పారు. జ్ఞానపీఠ ఫౌండేషన్‌ నిర్దేశకుడు లీలాధర్‌ మాండ్లోయి అధ్యక్షత వహించిన ఈసదస్సులో డీకే పబ్లిషర్స్‌ అధినేత రమేశ్‌ మిట్టల్‌, డీసీ బుక్స్‌ అధినేత రవి డీసీ, ప్రముఖ ఉర్దూ రచయిత, ప్రచురణ కర్త హఖ్కానీ అల్‌ ఖాస్మీ తదితరులు పాల్గొన్నారు