‘పునాదిరాళ్లు’ సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ రాగాల ప్రస్థానం

విజయవాడ కల్చరల్‌: భారతదేశపు భావి పౌరులం... భవితవ్యానికి భాగస్వాములం.. బాధ్యత నెరిగీ బ్రతికేవాళ్లం... భావితరానికి పునాది రాళ్లం.. ఒకనాడు యువతలో ఉత్తేజాన్ని నింపిన ‘పునాదిరాళ్లు’ చిత్రంలోని ఈ పాటకు స్వరకర్త సంగీత విద్వాంసుడు ప్రేమ్‌జీ. విజయవాడ నగరానికి చెందిన ఆయన సుమారు వెయ్యి పాటలకు సంగీతాన్ని స్వరపరిచారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం పునాదిరాళ్లు. సినీ సంగీతానికి ఏనాడో గుడ్‌బై చెప్పేసినా, లలిత సంగీత కచేరీలతో తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మెలోడీ ఫేమ్‌ ప్రేమ్‌జీ.. సంగీత నేపథ్యం నేటి ‘సరిగమ’లకు ప్రత్యేకం.
 
జీవన ప్రయాణం..
స్వస్థలం జిల్లాలోని మానికొండ. జక్కుల లాజరన్‌, దేవదీవెనమ్మ తల్లిదండ్రులు. నాన్న ఉపాధ్యాయుడు. ఆయనకు సంగీతం అంటే ప్రాణం. నాటకాలకు, పంక్షన్ల వేదికలపై ఆయన పాడేవారు. ఆయనతో పాటు నేనూ నాటకాలకు వెళ్లేవాణ్ణి. చిన్నగా సంగీతంపై మమకారం పెరిగింది. నా ఆసక్తిని చూసిన నాన్న నాకు సంగీతం నేర్పించాలని ఉన్న పొలం అమ్మి, మంచి హార్మోనియం కొన్నారు. మిగిలిన డబ్బులతో ఊళ్లో ఉన్న అప్పులన్నీ తీర్చారు. చదువు కొనసాగిస్తూనే, వసంతరావు దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకున్నాను. ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందుస్థానీ డిప్లమో చేశాను. గురువు జె.వి.ఎస్‌.రావు దగ్గర ఐదేళ్లు సాధన చేశాను. నాటకాల్లో పద్యాలు, పాటలకు సంగీత సహకారం అందింస్తూనే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ బిఈడీ పూర్తి చేశాను. వేముల కూర్మయ్య హైస్కూల్‌లో ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో సంగీతంపై దృష్టి పెట్టాను.  హార్మోనియం, కీబోర్డుతో పాటు వెదరువాసాలతో స్వంతగా తయారు చేసుకున్న ఫ్లూట్‌నూ కచేరీల్లో ఉపయోగించేవాడిని. దీంతో పాటు లలిత గీతాలనూ స్వరపరిచేవాడిని.
 
26 ఏళ్లుగా లలిత సంగీతం....
 ఆకాశవాణి, దూరదర్శన్‌లలోనే కాక, ఇతర వేదికలపైనా 25 మంది సంగీత, వాద్య బృందంతో లలిత సంగీత కచేరీలు చేశాం. చాలా నాటకాలు, నాటికలకు, నేపథ్య సంగీతాన్ని అందించాము. నెఫ్జా నాటక కళాపరిషత్‌ పేరిట ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి, దేశంలోని పెద్ద నగరాలలో ప్రదర్శనలిచ్చాం. 50కుపైగా దేశభక్తి గీతాల క్యాసెట్లు తయారు చేశాను. ఆకాశవాణిలో 1992 నుంచి ప్రారంభించిన కంపోజ్‌ నేటికీ సాగుతోంది. జన్మభూమి, నీరు, వాతావరణం, డ్వాక్రా, యువజన కార్యక్రమాల కోసం అనేక పాటలు సమకూర్చాను. ‘డ్యాష్‌’ స్వచ్చంద సేవా సంస్ధను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టాను. వివిధ అంశాలకు సంబంధించి సుమారు 500 పాటల క్యాసెట్లు రూపొందించాను. 
 
చిరంజీవికి నాకూ తొలి సినిమా ‘పునాదిరాళ్లు’
1978లో రూపొందించిన ‘పునాదిరాళ్లు’ నాకూ, నటుడు చిరంజీవికీ తొలి సినిమా. ఆ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఒక రకంగా ఈ సినిమా చిరంజీవికి నటునిగా జన్మనిచ్చిందనే చెప్పాలి. ఆ సినిమా గుర్తుకొస్తే, నా మనసు వరదలొచ్చిన కృష్ణమ్మలా ఉప్పొంగుతుంది. ఆ జ్ఞాపకాల అలలు నన్ను నేటికీ ముంచెత్తుతాయి.
 
అవకాశం లభించిందిలా....
పునాదిరాళ్లు దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయనదీ విజయవాడే. నా సంగీతం గురించి తెలిసిన ఆయన నన్ను సంగీత దర్శకునిగా ఎంచుకున్నాడు. నిర్మాత ఖాదర్‌దీ విజయవాడే. అందరూ కలిసి బావాజీపేటలోని మా ఇంటికి వచ్చారు. అక్కడ పది రోజులు కూర్చుని పాటలకు సంగీతం సమకూర్చాం. సినిమాలోని అయిదు పాటల్లో ఒకటి జాలాది రాయగా, మిగిలిన నాలుగు దర్శకుడు రాజ్‌కుమారే రాసిచ్చారు. పాటల రీరికార్డింగ్‌  ప్రసాద్‌, జెమినీ స్టూడియోల్లో జరిగింది.
ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు, ప్రశంసలు వచ్చాయి. నా అభిమాన సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు నా పాటల్ని మెచ్చుకున్నారు. నాకు అంతకన్నా గొప్ప ప్రశంస ఏముంటుంది. 
 
ధైర్యం చేయలేకపోయాను
 పునాదిరాళ్లు పాటలువిని డి.రామానాయుడు నాకు అవకాశం ఇస్తానన్నారు. కుమరన్‌ బ్రదర్స్‌లో ఒకరు కూడా కబురు పంపారు. నేను వెళ్లలేదు. పునాదిరాళ్లు తరువాత రెండు సినిమాలు ఒప్పుకున్నాను. పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాతలు సినిమాను విడుదల చేయలేకపోయారు. నాకు డబ్బులు అందలేదు. మరోవైపు నా ఉద్యోగానికి సెలవు పెట్టి అటు వెళ్లడానికి భయమేసింది. సినీ సంగీత దర్శకునిగా నా ప్రస్థానం అక్కడితో ముగిసింది. పునాదిరాళ్లు సినిమాకు నంది అవార్డు రావడానికి ముందే రంగస్థలంలో ప్రేమ సామ్రాజ్య నాటకానికి నాకు ఉత్తమ సంగీత దర్శకునిగా నంది వచ్చింది.
 
సంగీత ప్రపంచంలోనే..
1992లో ప్రధానోపాధ్యాయునిగా రిటైర్‌ అయ్యాను. నాటి నుంచి ఆలిండియా రేడియో ప్రోగ్రామ్స్‌, ఆర్కెస్ట్రాలో పని చేస్తున్నాను. 1998లో నెహ్రూ యువ కేంద్ర మ్యూజిక్‌ అవార్డు, ఘంటసాల మ్యూజిక్‌ అవార్డు వచ్చాయి. ప్రస్తుతం లలిత సంగీత కచేరీలు నిర్వహిస్తున్నాను.