చిక్కడపల్లి, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): చిరుప్రాయంలో లేత హృదయం ఎంత కలతబడిందో ‘రాలిన చుక్కలు’ కవితా సంపుటిలో విశదీకరించారని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాత్రి యువ కవయిత్రి విప్లవ శ్రీ రాసిన కవితా సంపుటి ‘రాలిన చుక్కలు’ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌తేజ మాట్లాడుతూ విప్లవశ్రీ కవిత్వంలో విప్లవం తొణికిసలాడుతోందన్నారు. చిన్న వయస్సులోనే ఇంతటి పరిణతి చెందిన కవిత్వం రాస్తోందని అభినందించారు. మోదుగుపూలు ఎడిటర్‌ భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం కార్యదర్శి కె.హిమబిందు మాట్లాడుతూ విప్లవశ్రీ కవిత్వంలో తన జీవితాన్ని ఆవిష్కరించారన్నారు. బోల యాదయ్య పుస్తకాన్ని పరిచయం చేస్తూ కవిత్వమై సమాజాన్ని చేరుకుని కవిత్వం రాస్తున్న కవయిత్రి విప్లవశ్రీ అన్నారు. ఈ సభలో తగుల్ల గోపాల్‌, నస్రీన్‌ఖాన్‌, సలీమ, తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహనకృష్ణ, కేపీ లక్ష్మి, నరసింహ, సాయికిరణ్‌, ముజాహిద్‌ తల్లి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.