చిక్కడపల్లి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): నిర్మాతలకు స్ఫూర్తిదాయకుడు రామానాయుడు అని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ అన్నారు. బుధవారం రాత్రి త్యాగరాయగానసభలో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్‌ డి.రామానాయుడు జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ రామానాయుడు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. పధ్నాలుగు భాషల్లో సినిమాలు నిర్మించిన గొప్పవ్యక్తి అని, నిర్మాత పనిచేస్తే టెక్నీషియన్లతోసహా యూనిట్‌లోని అందరూ పనిచేస్తారని చెప్పేవారన్నారు. ఆయన ఉదయం ఆరు గంటలకే ఫస్ట్‌షాట్‌ తీసేవారన్నారు. ఆ రకంగా పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పినవారు రామానాయుడు అన్నారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా యూనిట్‌లోని వారికి ఒక్కరూపాయి తగ్గకుండా రామానాయుడేస్వయంగా పేమెంట్‌లు చేసేవారని, మధ్యవర్తుల వల్ల ఎవరూ మోసపోవద్దనే ఆలోచనతో స్వయంగా వేతనాలు పంచేవారన్నారు. ఆయనలాంటి నిర్మాతలు చాలా తక్కువగా ఉంటారన్నారు. 

టీవీ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు షరీఫ్‌ మాట్లాడుతూ 14 భాషల్లో సినిమాలు నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడు అన్నారు. 120 సినిమాలకు పైగా ఆయన నిర్మించారన్నారు. ఈ సమావేశంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, దైవజ్ఞశర్మ, గాయకులు శివరామకృష్ణ, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.