బోయిన్‌పల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రామాయాణాన్ని పాఠ్యాంశం చేయాలని, రామమందిర నిర్మాణంతో పాటు అఖండ భారతావనిలో గురువారాన్ని వారాంతపు సెలవుదినంగా ప్రకటించాలన్న సంకల్పంతో శ్రీ రామదాస మిషన్‌ యూనివర్సల్‌ సొసైటీ ఆధ్వర్యంలో రామరాజ్య రథయాత్ర ఈ నెల 4న తమిళనాడులోని రామేశ్వరం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ దేవాలయం వద్దకు రామరాజ్య రథం చేరుకుంది. తాడ్‌బంద్‌ దేవాలయ చైర్మన్‌ బూరుగు వీరేశం ఆధ్వర్యంలో  భక్తులు, సంఘ్‌ కార్యకర్తలు, విశ్వహిందూ పరిషత్‌కార్యకర్తలు  రామరాజ్య రథంలో యాత్ర నిర్వహిస్తున్న పురమపూజ్య స్వామి కృష్ణానంద సరస్వతికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న స్వామీజీ తాడ్‌బంద్‌ వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తమిళనాడులో ప్రారంభమైన ఈ రథయాత్ర ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో పర్యటించి శ్రీరామనవమి రోజున అయోధ్య చేరుకుంటుందని, ఈ సందర్భంగా శ్రీరామపట్టాభిషేకం, రామరాజ్యస్థాపన జరుగుతాయని  ప్రకటించారు.