చిక్కడపల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): నృత్య నీరాజనం కార్యక్రమం రసరమ్యంగా సాగింది. సిద్ధేంద్ర ఆర్ట్స్‌ అకాడమీ 37వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం త్యాగరాయగానసభలో కళాకారులు పలు నృత్యాంశాలను   అద్భుతంగా ప్రదర్శించి శ్రోతలను ఆకట్టుకున్నారు. కూచిపూడి నృత్యాన్ని ప్రియాంక, శిష్యబృందం, కథక్‌ను పండిట్‌ అంజిబాబు శిష్యబృందం, పేరిణి నృత్యాన్ని పవన్‌కుమార్‌, జానపద నృత్యాన్ని చాందిని, భరతనాట్యాన్ని జష్మిత, రాజస్థానీ నృత్యాన్ని ప్రియాంక భర్‌డే ప్రదర్శించారు. ఒకే వేదికపై ఒకే కార్యక్రమంలో ఇన్ని నృత్యాంశాలను ప్రదర్శించడం పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు టి. బాలకామేశ్వరరావుకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి శివకుమార్‌, సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యుడు డా. ఎం వాసుదేవరెడ్డి  పాల్గొని కళాకారులను అభినందించారు. నిర్వాహకురాలు దేవసేన కార్యక్రమానికి సారఽథ్యం వహించారు.