యాకుబ్‌ సాహిత్య సేవ అభినందనీయం: దేశపతి

ఖమ్మం సాంస్కృతికం, ఏప్రిల్‌ 15: తెలంగాణ ప్రజలను జాగృత పరిచింది రావెళ్ల వెంకటరామారావు గీతాలేనని కవి, గాయకుడు, సీఎంవో ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. ఖమ్మంలో రావెళ్ల స్తూపం నిర్మించి.. దానిపై ఆయన రాసిన పాటను చెక్కించాలని కోరారు. ఆదివారం రాత్రి ఖమ్మంలో.. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి అధ్యక్షుడు యాకుబ్‌కు తెలంగాణ తొలితరం గేయ రచయిత, ప్రసిద్ధ కవి రావెళ్ల వెంకటరామారావు స్ఫూర్తి పురస్కారాన్ని ప్రదానం చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నెలనెలా వెన్నెల, ఖమ్మం పౌరసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను సంఘటితం చేసింది ఉద్యమమేనని, అందుకు రావెళ్ల గీతాలు స్ఫూర్తి అని పేర్కొన్నారు.

తెలంగాణ తొలితరం ఉద్యమ నేత అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ పేర నెలనెలా వెన్నెల పేరుతో కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మం జిల్లా ఖనిజ సంపదకు నిలయమని, తెలంగాణ చరిత్ర అంతా ఖమ్మంలోనే ఉందని అన్నారు. ఖమ్మంకు రావడం ఎంతో ప్రేరణనిస్తుందన్నారు. తెలుగు సాహిత్యానికి యాకుబ్‌, శిలా లోహిత్‌ చేసిన సేవలు గొప్పవని దేశపతి ప్రశంసించారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ మాట్లాడుతూ.. కవి యాకుబ్‌కు రావెళ్ల పురస్కారం అందించడం అభినందనీయమన్నారు. కొత్తగూడెం బస్టాండ్‌లో విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభించిన యాకుబ్‌ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. ఓ గీత రచయితగా, కవిగా ఎంతో పేరు తెచ్చుకున్నారన్నారు. కాగా ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని కవి యాకుబ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కవి, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర, నగర మేయర్‌ పాపాలాల్‌, కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.