చిక్కడపల్లి, జూలై 5 (ఆంద్రజ్యోతి): జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌, డా.రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగరాయగాసభలో సీనియర్‌ పాత్రికేయులు డా. పొత్తూరి వెంకటేశ్వరరావుకు జ్ఞానపీఠ్‌ పురస్కారగ్రహీత డా. రావూరి భరద్వాజ స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పద్మశ్రీ పురస్కారగ్రహీత సునీతాకృష్ణన్‌ పక్షాన సుజాత ఈ సందర్భంగా శ్రీమతి రావూరి కాంతమ్మ స్మారక సాంఘిక సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎ.చక్రపాణి మాట్లాడుతూ పొత్తూరి వెంకటేశ్వరరావు పాత్రికేయుడిగా, ఎడిటర్‌గా జర్నలిజం రంగానికి అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవన్నారు. ఆయన నేటి జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో వీబీ లా ఛాంబర్స్‌ చైర్మన్‌ పి.విజయబాబు, కళా జనార్దనమూర్తి, రావూరి వెంకటకోటేశ్వరరావు, గుదిబండి వెంటకరెడ్డి, రాఘవరెడ్డి, రావూరి సాయి సుమంత్‌ పాల్గొన్నారు.