రేపు హైదరాబాద్‌లో ప్రదానం

రాంనగర్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, రచయిత, కథకుడు, విమర్శకుడు కోడూరి విజయకుమార్‌కు ఈ ఏడాది మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం ఆదివారం ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వికాస సమితి, రాష్ట్ర సాంస్కృతికశాఖ సంయుక్తాధ్వర్యంలో పురస్కార ప్రదానం జరుగుతుంది. తెలంగాణ వికాస సమితి హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రాజమహేందర్‌రెడ్డి ఈ విషయం తెలిపారు. ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ సంతో్‌షకుమార్‌, విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే బాల్క సుమన్‌, గౌరవ అతిథులుగా సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ఆయాచితం శ్రీధర్‌, కె.సీతారామారావు తదితరులు హాజరవుతారు.

 వరంగల్‌లో 1969 జూలై 1న జన్మించిన విజయకుమార్‌ ప్రస్తుతం తెలంగాణ ట్రాన్స్‌కోలో డివిజనల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆయన తన కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. విజయకుమార్‌ ‘వాతావరణం’, ‘అక్వేరియంలో బంగారు చేప’, ‘ఒక రాత్రి-మరొక రాత్రి’, ‘అనంతరం’ పేరుతో కవితా సంపుటాలను వెలువరించారు. కవిత్వంతోపాటు కథలు, రెండు నాటకాలు, కొన్ని సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాశారు. ఉత్తమ కవిత్వానికిగాను 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకున్నారు. ఆయనకు నూతలపాటి గంగాధరం అవార్డు, ఉమ్మడిశెట్టి పురస్కారం, స్నేహనిధి అవార్డులు లభించాయి. ఆయన కవితలలో కొన్ని ఇంగ్లిషు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీలోకి అనువాదమయ్యాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత మధ్యతరగతి, పట్టణజీవుల జీవన పరిస్థితులను ఇతివృత్తంగా రాసిన పలు కవితలు ఆదరణ పొందాయి.