రవీంద్రభారతి, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): సమాజం ప్రభావితమయ్యే గ్రంథాలను రాసేవారికి నిబద్ధత అవసరమని దాంతో పాటు పట్టుదల, గొప్ప కార్యచరణ ఉండాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీరమణాచారి అన్నారు.  మంగళవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో డాక్టర్‌ గుమ్మన్న బాల శ్రీనివాసమూర్తి, గుమ్మన్న వేణుమాధవ శర్మ సంపాదకత్వంలో రూపొందించిన, బండ్ల పబ్లికేషన్స్‌ ప్రచురించిన ‘సాహితీ సుధ’ గ్రంథావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. కలం బాగుంటే సరిపోదని కలంలో బలం ఉండాలన్నారు. సాహితీ సుధ గ్రంథం నేటితరానికి జ్ఞానాన్ని బోధిస్తోందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ 48మంది రచయితలు, 1000పేజీల సాహితీ సుధ మంచి  విషయాలను తీసుకొచ్చిందన్నారు.  ఈ కార్యక్రమంలో తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, మామిడి హరికృష్ణ,  ఏనుగు నర్సింహారెడ్డి,  ఆచార్య కసిరెడ్డి, వెంకటరెడ్డి, ఆచార్య సూర్యధనుంజయ్‌, ఆచార్య వెల్దండ నిత్యానందరావు, డా.చెప్పెల హరినాథశర్మ, ముదిగొండ అమరనాథశర్మ తదితరులు పాల్గొన్నారు.