సాహిత్య అకాడమీ అవార్డు ప్రదాన సభలో ప్రశంసలు

తెలుగు సలహా బోర్డు కన్వీనర్‌గా శివారెడ్డి

అకాడమీ నూతన అధ్యక్షుడుగా చంద్రశేఖర కంబార

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి దేవిప్రియకు 2017వ సంత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. అకాడమీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నడ రచయిత చంద్రశేఖర కంబార ఆయనకు సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. దేవిప్రియ కవిగా, జర్నలిస్టుగా స్ర్కిప్టు రచయితగా, సంపాదకుడుగా, గేయ రచయితగా బహుముఖ ప్రతిభా శాలి అని ఆయనకు అందించిన ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు.

‘‘దేవిప్రియ కవితా సంపుటి- గాలి రంగు -సామాజిక చైతన్యానికి అద్దం పట్టిందని, సామాన్య ప్రజలకు చేరువేయ్యే భాషలో రచించిన ఆయన కవిత్వం భారతీయ సాహిత్య ప్రతిష్టను ఇనుమడింపచేసిందని’’ అందులో కొనియాడారు.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత ప్రొఫెసర్‌ మహమ్మద్‌ బేగ్‌ ఎహ్‌ సాస్‌ కూ డా- దఖ్మా పేరుతో రచించిన కథాసంకలనానికి సా హిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు ప్రశంసాపత్రం, రూ.లక్ష నగదు అందించారు. కాగా కేంద్ర సాహిత్య అకాడమీకి తెలుగు సల హా బృందం కన్వీనర్‌గా ప్రముఖ కవి కె.శివారెడ్డిని ఎంపిక చేశారు. అకాడమీ సాధారణ సమితిలో జరిగిన ఎన్నికల్లో శివారెడ్డిని సభ్యులు అత్యధిక మెజారిటీతో కన్వీనర్‌గా ఎంచుకున్నారు. ఆయనతో పోటీ పడిన రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి అంతకంటే తక్కువ ఓట్లు లభించాయి.ఆరేళ్లుగా ఈ బోర్డుకు ప్ర ముఖ తెలంగాణ కవి ఎన్‌.గోపి కన్వీనర్‌గా ఉన్నారు.