చిక్కడపల్లి, అక్టోబర్‌10(ఆంధ్రజ్యోతి): రసమయి సంస్థ ఆధ్వర్యంలో రఘుపతి వెంకయ్య అవార్డుగ్రహీత డా.సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా బుధవారం సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు డా. సింగీతం శ్రీనివాసరావుకు సాలూరి ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. రసమయి సంస్థ ప్రేరణతో డా. సాలూరి రాజేశ్వరరావుపై భారతప్రభుత్వ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌(తెలంగాణ రాష్ట్రం) రూపొందించిన సాలూరి రాజేశ్వరరావు ప్రత్యేక చంద్రిక(సాలూరి స్పెషల్‌ పోస్టల్‌ కవర్‌) ఆవిష్కరణ సైతం ఈ సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమిళనాడు మాజీ గవర్నర్‌ డా. కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ ఒక అద్భుత సంగీత ప్రపంచాన్ని అందించిన గొప్ప సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు అని అన్నారు. నిర్వాహకుడు డా. ఎం కె రాము మాట్లాడుతూ సాలూరి రాజేశ్వరరావు పుత్రులందరూ పండితులేనన్నారు.కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు రుద్రరాజు పద్మరాజు, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, సాలూరి రాజేశ్వరరావు కుమారుడు సాలూరి కోటి, సంగీత విద్వాంసులు మంగళగిరి ఆదిత్యప్రసాద్‌, సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌, సీనియర్‌ పాత్రికేయుడు మహ్మద్‌ రఫీ, ధ్వన్యనుకరణ కళాకారుడు జీవీఎన్‌ రాజు, ఎంకెఆర్‌ ఆశాలత, తపాలాశాఖ డైరెక్టర్‌ వీవీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాలూరి వారి పాటలను పలువురు గాయనీగాయకులు ఆలపించారు