కరీంనగర్‌ కల్చరల్‌: సామాజిక కోణంతో శతాధిక రచనలు చేసిన శ్రీభాష్యం విజయసారధి సంస్కృత సాహితీ శిఖరమని, ఆయనను మహోన్నత వ్యక్తిగా, గురువుగా భావిస్తున్నానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం బొమ్మకల్‌ రోడ్‌ యజ్ఞవరాహ క్షేత్రంలో వరంగల్‌కు చెందిన సాహితీవేత్త డాక్టర్‌ మాదిరాజు బ్రహ్మానందరావు విజయసారధి జీవితం, రచనలపై రచించిన జీవన సారణి గ్రంథావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

యువశక్తి, విద్యార్థి శక్తికంటే జ్ఞాన వృద్ధుల శక్తి వెలకట్టలేనిదని, మూడు తరాలను చూసిన విజయసారధి గొప్ప మానవ సంబంధాలను తన సాహిత్యంలో ఆవిష్కరించారని పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆయన సాహిత్యం రేపటి తరానికి సజీవంగా ఉంటుందని తెలిపారు. నైతిక విలువలతో సాహిత్యాన్ని సృష్టిస్తూ మరోవైపు యజ్ఞవరాహ స్వామి క్షేత్రం, సర్వవైదిక సంస్థానం ద్వారా ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటుతున్న సారధి అభినందనీయులని, వారి సాహిత్యానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. మానవ జీవితానికి శాంతి ఇలాంటి మహనీయుల సాహిత్యంతోనే సాధ్యమని అన్నారు. 

జిల్లా బిడ్డ కావడం గర్వకారణం

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ విజయసారధి తెలంగాణలో, అది కరీంనగర్‌ జిల్లాలో జన్మించడం గర్వకారణమని అన్నారు. ఆయనలాంటి వ్యక్తి ఆంధ్రాలో పుట్టి ఉంటే ఆకాశానికి ఎత్తుకునేవారని, పద్మశ్రీ అవార్డుకు నూటికి నూరుపాళ్లు అర్హత ఉన్న వ్యక్తి అని అన్నారు. సభకు అధ్యక్షత వహించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తన విజయానికి సారధ్యం విజయసారధేనని, యజ్ఞవరాహ స్వామిని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశీస్సులు అందరికి ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. 

అంతకు ముందు గ్రంథాన్ని ఆవిష్కరించి రచయిత దంపతులను, గ్రంథ ఆర్థికదాత డాక్టర్‌ మోహన్‌రావు-జ్యోతి దంపతులను సన్మానించారు. డాక్టర్‌ గిరిజామనోహర్‌బాబు, డాక్టర్‌ గండ్ర లక్ష్మణ్‌రావులు గ్రంథ సమీక్ష చేశారు. డాక్టర్‌ నలిమెల భాస్కర్‌, డాక్టర్‌ కలువకుంట రామకృష్ణ, దాస్యం సేనాధిపతి, నారాయణం తనూజ్‌ విష్ణువర్దన్‌, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ఆచార్య యాదగిరి, గ్రంథ రచయిత డాక్టర్‌ మాదిరాజు బ్రహ్మానందరావు, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డిలు మాట్లాడారు.

కేఎస్‌ అనంతాచార్య, రాజారాం మోహన్‌ సమన్వయం మధ్య సాగిన ఈ కార్యక్రమంలో సర్వవైదిక సంస్థానం కులపతి శ్రీభాష్యం విజయసారధి, కరీంనగర్‌, పెద్దపల్లి గ్రంథాలయ సంస్థల చైర్మన్లు ఏనుగు రవీందర్‌ రెడ్డి, రఘువీర్‌సింగ్‌తోపాటు సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి, అతిథులకు పూర్ణకుంభస్వాగతం పలికి స్వామివారి దర్శన అనంతరం శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. సిద్ధిఇష చేసిన నృత్యం ఆకట్టుకుంది.