హెచ్‌సీయూ కులపతి జస్టిస్‌ నరసింహారెడ్డి
ఘనంగా సంస్కృత విద్యాపీఠం స్నాతకోత్సవం
ముగ్గురికి మహా మహోపాధ్యాయ,
ఇద్దరికి వాచస్పతి పురస్కారాలు ప్రదానం

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 9: అన్ని భాషలకు సంస్కృతం మూలమని, ఆ భాష మనకు తెలియకపోయినా నిత్యం అనేక పదాలు ఉపయోగిస్తున్నామని హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి జస్టిస్‌ నరసింహారెడ్డి స్నాతకోపన్యాసం చేశారు. దేశ సార్వభౌమత్వానికి, జాతి యావత్తు ఒకతాటిపై నడవడానికి సంస్కృతం ప్రధానమైన సాధనమని అభివర్ణించారు. వ్యక్తిత్వ వికాసానికి సంస్కృత అధ్యయనం దోహదపడుతుందని చెప్పారు.

ప్రాచీన భారత విజ్ఞాన వేత్తలైన ఆర్యభట్ట, శుశృతుడు, చరకుడు, చాణుక్యుడు, పాణిని, జైమిని, నాగార్జునుడు వంటివారి గురించి విద్యార్థులకు పాఠాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. సంస్కృత విద్యాపీఠం కులపతి ఎన్‌.గోపాలస్వామి మాట్లాడుతూ విద్యాపీఠం కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మారేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా సంస్కృతంలో నిష్ణాతులైన విద్వాన్‌ తిగుళ్ల శ్రీహరిశర్మ, విద్వాన్‌ ఎంఎస్‌ రాజగోపాలాచార్యులకు మహా మహోపాధ్యాయ గౌరవ పురస్కారాలు ప్రదానం చేసి ఘనం గా సత్కరించారు. మరో పండితుడు పద్మశ్రీ కేశవరావు సదాశివశాస్త్రి ముస ల్గా ఓంకార్‌ (92) అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. త్వరలో వర్సిటీ ప్రతినిధులు గ్వాలియర్‌ వెళ్లి ఆయనకు మహామహోపాధ్యాయ గౌరవ పురస్కారం అందించనున్నారు.
 
అలాగే ప్రొఫెసర్‌ కేఎస్‌ కన్నన్‌, ఆచార్య ప్రేమ్‌సిద్ధార్థ్‌కు ముఖ్యఅతిథి వాచస్పతి గౌరవ పురస్కారాలు అందించారు. సాహిత్య, వ్యాకరణ, న్యాయ, జ్యోతిష్యాది శాస్త్రాల్లో 59మందికి పీహెచ్‌డీ డిగ్రీలు, వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 21మంది విద్యార్థులకు 42 బంగారు పతకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీసీ వి.మురళీధర్‌శర్మ, రిజిస్ట్రార్‌ జీఎ్‌సఆర్‌ కృష్ణమూర్తి, విద్యాపీఠం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.