చిక్కడపల్లి, సెప్టెంబర్‌11(ఆంధ్రజ్యోతి): సమాజంలో గురువుల పాత్ర  ఉన్నతమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ. దుర్గాప్రసాదరావు అన్నారు. శ్రీ కమలాకర లలిత కళాభారతి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఆదర్శనీయం అన్నారు. కమలాకర లలిత కళాభారతి సంస్థవారు చేస్తున్న సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవన్నారు. ఈ సందర్భంగా ఏఎమ్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి డా. ఎ ఎస్‌ సునీత, నర్తకి డా. కె రత్నశ్రీసుధాకర్‌, సంగీత కళాకారిణి డా. రాధా సారంగపాణిలకు గురు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లా చాంబర్‌ చైర్మన్‌ పి. విజయబాబు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ టి గౌరీశంకర్‌, ఉస్మానియా యూనివర్సిటీ డీన్‌ సులోచన, సాధన నరసింహాచార్య, నిర్వాహకులు భారతీ కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.