ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌: రచయిత, నంది అవార్డు గ్రహీత డాక్టర్‌ నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మనగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మంగళవారం ఎఫ్‌ఎనసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ ‘‘సిధారెడ్డి 25 ఏళ్లగా నాకు పరిచయం. మంచి రచయిత, సాహితీవేత్త. చేనేత కార్మికులపై అద్భుతమైన పాట రాసి వారి జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించిన గొప్ప రచయిత ఆయన. మంచి ఆలోచనతో కేసీఆర్‌ ఆయనకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మనగా నియమించడం తెలుగు భాషకు, తెలుగు సినిమాకూ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనుసన్నల్లో తెలుగు సినిమా పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుంది. నాకు ఈ అవకాశం కల్పించిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని నందిని సిధారెడ్డి తెలిపారు. దేశపతి శ్రీనివాస్‌, సాయివెంకట్‌, కవిత, జేవీఆర్‌, గీతాంజలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.