రవీంద్రభారతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవాలని మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూచించారు. శనివారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో వర్సిటీ 2016 ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి అజ్మీరా చందూలాల్‌ మాట్లాడుతూ భాషా పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు తెలుగు భాషపై మక్కువ ఉందని చెప్పడానికి ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావడమే నిదర్శనమన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్య సంపదను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ కళలు మనసును ఆహ్లాదపరుస్తాయన్నారు. సభాధ్యక్షత వహించిన వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులను వర్సిటీ సత్కరించుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అలేఖ్య పుంజాలతో పాటు వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
 
పురస్కారగ్రహీతలు వీరే..నవల, కథ- వసంతరావు దేశ్‌పాండే, కవిత్వం- వేణు సంకోజు, విమర్శ-నియోగి, చిత్రకళ-మాసురామ్‌ రవికాంత్‌, నృత్యం-డా.వనజా ఉదయ్‌, సంగీతం-కె.ఎ్‌స.ఆర్‌.బాలకృష్ణశాస్త్రి, నాటకరంగం-అయ్యదేవర పురుషోత్తమరావు, జానపద కళారంగం-అంగళకుర్తి రాంమూర్తి, అవధానం- జి.ఎం.రామశర్మ, ఉత్తమ రచయిత్రి-అయినంపూడి శ్రీలక్ష్మిలను రూ.20,116 నగదుతో పాటు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.