రవీంద్రభారతి, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): లాస్య ప్రియ వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్‌ కె.ఉమా రామారావు రచించిన షాహజీ యక్షగానం గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వ్యూహలక్ష్మి శీర్షికన ప్రదర్శించిన నృత్యరూపకం ఆహూతుల్ని రంజింపజేసింది. శుక్రవారం రవీంద్రభారతిలో లాస్య ప్రియ నృత్య సంస్థ 33వ వార్షికోత్సవం  నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమారామారావు రచించిన షాహజీ యక్షగానం గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సీనియర్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి తదితరులు పాల్గొని ఉమా రామారావును సేవలను కొనియాడారు. అనంతరం డాక్టర్‌ శ్రీకస్‌ ఆధ్వర్యంలో తరిగొండ వెంగమాంబ రచించిన నృత్యరూపకాన్ని నర్తకులు జనరంజకంగా ప్రదర్శించారు.