రాంనగర్‌, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యంలో గుంటూరు శేషేంద్రశర్మది చెరగని ముద్ర అని, నూరేళ్ల తెలుగు కవిత్వ చరిత్రలో కవిగా శర్మది శిఖరాగ్ర స్థానమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సినారె - వంశీ విజ్ఞాన పీఠం సంస్థల ఆధ్వర్యంలో శనివారం కళాసుబ్బారావు కళావేదికలో మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ జయంతి సందర్భంగా  మేరీ దర్తీ, మేరీ లోగ్‌ అనువాద గ్రంథావిష్కరణ జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమోస్కో సంపాదకుడు డాక్టర్‌ డి.చంద్రశేఖర్‌రెడ్డి శేషేంద్ర శర్మ హిందీ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శేషేంద్రశర్మ రచించిన ‘నా దేశం నా ప్రజలు’ గ్రంథంలో మహాకావ్య లక్షణాలు ఉన్నాయన్నారు. ఆయన రచించిన కవిసేన మ్యానిఫెస్టో తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ తెన్నేటి సుధాదేవి, కళా జనార్దనమూర్తి తదితరులు పాల్గొన్నారు.