44ఏళ్ల కవిత్వ జీవన ప్రస్థానంపై సాహిత్య సమాలోచనలో హరీశ్‌
అభినందన సంచిక ‘మందారం’ ఆవిష్కరణ
 

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డిని ‘సిద్దిపేట సాహితీ మందారం’గా మంత్రి హరీశ్‌ రావు అభివర్ణించారు. తనకు సిద్దన్న కవిత్వం కన్నా ఆయన తత్వమే బాగా ఎరుక అని అన్నారు. ‘మంజీరా రచయితల వేదిక’ స్థాపనతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కవులు, సాహితీవేత్తలందరినీ ఒకేచోటకు తెచ్చిన ఘనత సిధారెడ్డి సొంతమని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం వేదికగా తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ‘‘డాక్టర్‌ నందిని సిధారెడ్డి 44 ఏళ్ల కవిత్వ జీవన ప్రస్థానంపై సాహిత్య సమాలోచన’’ అనే జాతీయ సదస్సును మంత్రి హరీశ్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సిధారెడ్డి అభినందన సంచిక ‘‘మందారం’’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం హరీశ్‌ మాట్లాడారు. సిధారెడ్డి రాసిన ‘‘నాగేటి సాలల్లో నా తెలంగాణ’’ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిందని శ్లాఘించారు. సిధారెడ్డి కవిత్వం, కథలు, పాటలు తెలంగాణ జన జీవనాన్ని ప్రతిబింబిస్తాయని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. సిధారెడ్డి తన కవిత్వంలో తెలంగాణ పోకడలను వర్ణించారని ప్రముఖ కవి కె. శివారెడ్డి అన్నారు. తోడేలు పాలనలో గొర్రెలను కాసే కవి సిధారెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అభివర్ణించారు. ఆర్థ్రత, తీవ్రతల మేలు కలయికే సిధారెడ్డి అని దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. అగ్రశ్రేణి కవుల్లో సిధారెడ్డి ముఖ్యులు అని తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు.