కవులకు రావుల పిలుపు

పాటలతో రైతుల కష్టాలు తీరుతాయా?:నాగం

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం కళ్లు తెరిపించేలా పాటలు రాయాలని టీడీపీ-టీఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కవులు, కళాకారులకు పిలుపునిచ్చారు. గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైనందునే దానిని కప్పిపుచ్చుకోవడానికి రైతులకు చేస్తున్న సహాయ కార్యక్రమాలపై పాటలు రాయాలని కవులను సీఎం కేసీఆర్‌ కోరారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కవులు, కళాకారులు ఎంతో దోహదం చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో, సగటున రోజుకు ముగ్గురు చొప్పున 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయ న మాట్లాడారు. గిట్టుబాటు ధర రాక జగిత్యాల రైతు నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో తాను తెచ్చిన పసుపు కుప్పపైనే తనువు చాలించాడని, ఆదిలాబాద్‌ జిల్లా రైతు రాథోడ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతాలను కవులు గ్రహించాలన్నారు. ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసి సుప్రీం తీర్పును, మానవ హక్కులను కాలరాశారని ఆయన దుయ్యబట్టారు. కాగా, కవులు, కళాకారులను పిలిపించి.. పాటలు రాయించి పాడిస్తే రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తీరుతాయా అని బీజేపీ జాతీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలకు, కవుల పాటలకు ఏమైనా సంబంధముందా అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతిపైనే తాను పోరాటం చేస్తున్నానే తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవడంలేదని అన్నారు.