దక్షిణ భారత కవిత్వ ఉత్సవంలో కవులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సమాజ పురోగమనానికి కవిత్వం ఇంధనం వంటిదని పలువురు కవులు అభిప్రాయపడ్డారు. సంఘ సంస్కరణోద్యమం, స్వాతంత్య్ర పోరాటంలో కవిత్వం ఒక ఆయుధంగా నిలిచిందన్నారు. కవులు, రచయతల సామాజిక స్పృహ, ఆకాంక్ష వేరైనా వారి అంతిమ లక్ష్యం సమాజహితమేనని తెలిపారు. నేటి కవులు కూడా తమ కవిత్వాలను పుస్తకాల ద్వారా తీసుకొస్తున్నప్పటికీ వాటిని చదివేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన ‘దక్షిణ భారత కవిత్వ ఉత్సవం’లో పలువురు కవులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దక్షిణ భారతీయ భాషల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ ఉత్సవం ప్రధాన వేదికగా నిలుస్తోందని రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి కొనియాడారు.జాతీయ సాహిత్య సమావేశాలను నిర్వహించేందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని, అందుకు కేంద్ర సాహిత్య అకాడమీ సహకరించాల్సిందిగా కోరారు. కవిత్వంలోని ప్రతి అక్షరం వెనుక ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం దాగుంటుందని, అదే చాలా కీలకమని సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి కన్వీనర్‌ కె.శివారెడ్డి అన్నారు.

ఒక భాషకు సంబంధించిన సాహిత్య, సాంస్కృతిక విషయాలు, సమకాలీన రచనా శైలి, ఇతివృత్తాలు తదితర అంశాలు మరొక భాష వారు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నేషనల్‌, రీజనల్‌ లిటరరీ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు తెలిపారు.తమిళనాడులో సాహిత్యానికి ఆదరణ అంతంత మాత్రమేనని, అందుకు రాష్ట్ర ప్రభుత్వంలో సాహిత్యాభిమానులు లేకపోవడమే ప్రధాన కారణమని సాహిత్య అకాడమీ తమిళ సలహామండలి కన్వీనర్‌ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కవిత్వం ఉజ్వలంగా ఉందని, కవితా వస్తువుతో రాజీపడకుండా, ప్రగతిశీల కవిత్వాన్ని రాస్తున్న వారెందరో ఉన్నారని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ అన్నారు. ఈ సందర్భంగా అతిథులకు భాష, సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘‘తెలంగాణ హార్వెస్ట్‌’’, ‘‘కల్చర్‌ ఆఫ్‌ ఎమినిటీ’’, ‘‘ఎకో పోయెమ్స్‌’’, ‘‘కల్చర్‌ ఎట్‌ తెలంగాణ’’ పుస్తకాలను మామిడి హరికృష్ణ బహూకరించారు.