చదువు చెప్పకుండా నిషేధించారు. సంపాదకీయాలకు భయపడి జైల్లో పెట్టారు. అయినా, కలం బలం తగ్గలేదు. స్వర సంధానం ఆగలేదు. నిర్బంధాలు, నిషేధాలకు తోడు పేదరికం వెంటాడినా.. పోరాటపటిమ సన్నగిల్లలేదు. ఆయనే గాడిచర్ల.

మహాత్మాగాంధీకి వాగ్ధాటి ఎక్కువ. ఆయన ప్రసంగాల్లో పదును ఎంతుంటుందో, అంత వొడుపూ ఉంటుంది. హిందీ, ఆంగ్లభాషలలో సాగే ఆయన ప్రసంగాల వేగాన్ని అందుకొని.. అనువదించడం కత్తిమీద సామే. అందువల్లనే మహాత్ముడు రాయలసీమ ప్రాంతానికి వస్తున్నారనగానే, ముందుగా గాడిచర్ల హరిసర్వోత్తమరావుకే కబురు పోయేదట! ఒక చేత గ్రంథాలయోద్యమాన్ని, మరోచేత వయోజన విద్యా వ్యాప్తిని సాగించిన గాడిచర్ల, 1883 సెప్టెంబర్‌ 14న కర్నూలులో జన్మించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు.

విద్యార్థి నాయకుడిగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలిపి, స్కూల్‌నుంచి డిస్మిస్‌ అయ్యారు. అందరికీ విద్యను పంచాలనే సదాశయంతో రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అయితే, తీవ్ర జాతీయభావాలు ఉన్నాయనే కారణంగా, అధ్యాపకత్వానికి అనర్హుడిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నియంతృత్వ పోకడ ఆయనను బడికి దూరంచేసిందేగానీ, అక్షరానికి సేవ చేయకుండా ఆపలేకపోయింది. ‘స్వరాజ్య’ పేరిట వారపత్రిక ప్రారంభించారు.

ఏదో మొక్కుబడి కోసం అన్నట్లు కాకుండా, తెలుగు ప్రజలను స్వాతంత్య్ర పోరాటం వైపు మళ్లించేందుకు తన పదునైన వ్యాసాలతో కలం పోరాటం సాగించారు. ఒకానొక దశలో ఆయన సంపాదకీయ వ్యాసాలు బ్రిటీష్‌ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ‘విపరీత బుద్ధి’ శీర్షికన యువతను తీవ్రస్థాయిలో రెచ్చగొట్టేలా సాగిన ఓ సంపాదకీయ వ్యాసం బ్రిటీష్ వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న నెపంతో మూడేళ్లపాటు హరిసర్వోత్తమరావుని జైల్లో నిర్బంధించింది. జైలు నిర్బంధం ఆయన పట్టుదలను నిలువరించలేకపోయింది. జైలు జీవితం ముగిసి బయటకొచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా ఆయన స్వాతంత్య్ర పోరాట పిలుపుని అందుకొన్నారు. ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదేసమయంలో కత్తులూ కఠారులతో కాదు.. విద్య, విజ్ఞానంతోనే ప్రజల్ని జాగృతపరిచి, వలస పాలకులపై విరుచుకుపడేలా చేయాలని ఆయన భావించారు.

ఆయన ఆలోచన ఎంత ఉదాత్తమయిందనేది అనంతర చరిత్ర నిరూపించింది. తెలుగునాట తొలిసారి గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అటు వయోజన విద్యను, ఇటు గ్రంథాలయ విద్యను ఏకకాలంలో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. వేలకొద్దీ గ్రంథాలను పోగుచేసి విజ్ఞానాన్ని పదుగురికి పంచారు. ఆనాడు ఆయన నాటిన బీజాలే వటవృక్షాలై, ఇప్పుడు తెలుగు నాట గ్రంథాలయ ఉద్యమం శాఖోపశాఖలుగా విస్తరించింది. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, నిర్బంధాలు చవిచూసినా తన వాణిని బాణిని ఏనాడూ వెనక్కి తీసుకోలేదు. అందుకే ‘ఆంరధా తిలక్‌’ అంటూ ఆయనను జాతీయ నేతలు సైతం కొనియాడారు. 

స్వాత్రంత్యానంతరం... మద్రాసు శాసనమండలికి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఊహ తెలిసినప్పటి నుంచి అహరహం ప్రజలకోసమే శ్రమించిన హరిసర్వోత్తమ్‌.. 1960 ఫిబ్రవరి 29న చనిపోయారు. మనమంతా మహాత్ముడి అనుచరులం. ప్రజలకు మంచి చేద్దామని వచ్చాం. అదే మాధవసేన అనుకొన్నాం. అంతేగానీ, పదవులు, అధికారాల కోసం రాజకీయాల్లోకి రాలేదు.    -ప్రభుత్వంలో పదవి తీసుకోమన్నవారికి గాడిచర్ల సమాధానం.

- అమరావతి, ఆంధ్రజ్యోతి