ధిక్కార పతాక

తెలంగాణ భాషకు పట్టం కట్టిన యోధుడు

నేడు ప్రజాకవి కాళోజీ 103వ జయంతి

తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా నిర్వహణ

వరంగల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 8: బహుభాషా కోవిదుడైనా తెలుగు భాష, అందునా.. తెలంగాణ యాస పట్ల ఎనలేని మమకారం ఆయనకు. పరభాష వ్యామోహంలో కూరుకుపోయిన యువతను ఉద్దేశించి.. ‘‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచూ సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?’ అంటూ హూంకరించిన ధీశాలి! ఆయన కలం నుంచి జాలువారిన అక్షర తూటాలు ఎన్నో ఆలోచనలను రగిలింప చేశాయి. ఆయన అసమ్మతి, నిరసన, ధిక్కార స్వరం అగ్నికీలలతో సమానం. ఆయనే ప్రజాకవి కాళోజీ నారాయణరావు! ఆయన 87ఏళ్ళ జీవితం ఒక మహత్తర ఉద్యమ కావ్యమే. 20వ శతాబ్దపు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో అద్భుత అధ్యాయం. శనివారం ఆయన జయంతి. 1914 సెప్టెంబరు 9న కర్ణాటక లోని బీజాపూర్‌ జిల్లా రెట్టిహళ్లి గ్రామంలో కాళోజీ జన్మించారు. పూర్తిపేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరావు రాజారాం కాళోజీ. తల్లి రమాబాయి, తండ్రి రంగారావు. స్వగ్రామం మడికొండ. హన్మకొండలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

కాళోజీ పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చి నిజాం కొలువులో స్థిరపడ్డారు. తాతా తండ్రులది మహారాష్ట్ర. మాతామహులది కర్ణాటక. నివాసం తెలుగునేల. దీంతో కాళోజీకి మూడు భాషలు సహజంగానే అబ్బాయి. వీటితో పాటు ఆయన ఉర్దూ అరబ్బీ, ఫార్శీ, సంస్కృతం, ఆంగ్లం నేర్చుకున్నారు. ప్రాథమిక విద్య మడికొండలోనే జరిగింది. తర్వాత వరంగల్‌, మెదక్‌, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి లాయర్‌ పట్టా పొందారు. కొంత కాలం హైదరాబాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అనంతరం ఆ వృత్తిని వదిలేసి ప్రజా సంక్షేమ ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేశారు. గవిచెర్ల గ్రామవాసి వేలూరి మాణిక్యరావు కుమార్తెతో 1940లో కాళోజీ వివాహం జరిగింది. కాళోజీ కవిత్వం అంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది. ఆయన జయంతిని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.