వేద ప్రమాణాలను అంగీకరించారు. కానీ, అమావాస్యనాడు ఉద్యోగంలో చేరారు. దేవుణ్ణి విశ్వసించారు. కానీ, విగ్రహారాధనను నిరసించారు. మాతృభాషను కోరారు. తాను మాత్రం సరళ గ్రాంథికంలోనే రచనలు చేశారు. ఇంతలా తన బాటలో, మాటలో, రాతలో వైవిధ్యం చూపించిన వైతాళికుడు తెలుగు నేల మీద ఒకే ఒక్కడు.. కందుకూరి వీరేశలింగం పంతులు.

కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరం లో సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పూర్వీకులది ఏలూరు. తాత పేరు వీరేశలింగం. అదే పేరు ఆయనకు పెట్టారు. తన తాత కాలంలో వీరి కుటుంబం రాజమహేంద్రవరం వచ్చి స్థిరపడింది. అప్పట్లో కన్యాశుల్కం దురాచారంగా ఉండేది. ముక్కుపచ్చలారని పిల్లలను డబ్బు కోసం ముసలి వారికిచ్చి పెళ్లి చేసేవారు. ఆ ముసలి భర్త చనిపోతే ఆ చిన్నారులు జీవితాంతం వైధవ్యం అనుభవించాల్సి వచ్చేది. ఇలాంటి బాల వితంతువుల అవస్థలను చూస్తూ, వీరేశలింగం పెరిగి పెద్దయ్యారు. ఆయనలో దుడుకుతనం ఎక్కువ. అన్యాయాన్ని చూస్తే తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయేవారు. తన కుటుంబంలో, బంధువుల ఇళ్లలో జరిగే బాల్య వివాహాల తంతును చిన్నతనంలోనే వ్యతిరేకించారు. ఆంగ్ల విద్య, పాశ్చాత్య భావాల పరిచయంతో ఆవేశానికి ఆలోచన తోడైంది. వేదాలను లోతుగా పరిశీలించారు.
 
కన్యాశుల్కం, బాల్య వివాహాలు వంటి సంప్రదాయాలను దైవ దత్తాలుగా ప్రచారం చేస్తున్న పండితుల ను, వారు చెబుతున్న ప్రమాణాలతోనే ఎదుర్కొన్నారు. పండితుల నోరు మూ యించారు. వాదనలో నెగ్గలేక కొందరు వీరేశలింగంపై భౌతికదాడికి పథకరచన చేశారు. మద్రా్‌సలో వితంతు వివాహం జరుపుతున్నాం.. మీరు రావాలని ఆయనను పిలిచారు. అక్కడకు వెళ్లాక, కొంతమంది చుట్టుముట్టి వీరేశలింగంపై దౌర్జన్యానికి దిగారు. ఆయనకు అండగా విద్యార్థులు ముందుకొచ్చి, ఆ మూకకు బుద్ధి చెప్పారు. ఈ ఒక్క సందర్భంలోనే కాదు. ఆయన వేసిన ప్రతి ఉద్యమ అడుగు లో విద్యార్థులు, ఆయన భార్య రాజ్యలక్ష్మి వెంట నిలిచారు. చాలా సందర్భాల్లో సంఘ సంస్కరణకు జరిగిన ప్రయత్నాలు సంఘర్షణాత్మకంగా పరిణమించేవి. కాకినాడ, రాజమహేంద్రవరం, మద్రాస్ లో వీరేశలింగం నాయకత్వంలో ఉద్యమస్థాయిలో బాలికా విద్య, వితంతు వివాహాల కోసం కృషి సాగింది. దీనికోసం 1874లో ఆయన వివేకవర్థిని పత్రికను స్థాపించారు.
 
సద్గుణాల ప్రచారానికి తొలి సంచికలు పరిమితం అయినా, ఆ తరువాత నుంచి మతం, కులం, సంఘం, ధర్మం వంటి అంశాలపై రచనలను ప్రచురించారు. బ్రహ్మసమాజం వైపు అడుగులు వేశారు. స్త్రీల కోసం సత్యవాది అనే పత్రికను ఇంగ్లిష్‌, తెలుగులో నడిపారు. మహిళా సమస్యలపై ఉద్యమించడానికి హితకారిణీ సమాజం ఏర్పాటు చేశారు. తన మిత్రులు చల్లపల్లి బాపయ్య, బసవరాజు గవర్రాజు, ఏలూరి నరసింహంతో ‘పునర్వివాహ సమాజం’ నడిపించా రు. ఈ సమాజం 1881 డిసెంబరు 11న మొదటి వితంతు వివాహం నిర్వహించింది.
 
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజమహేంద్రవరానికి సాంస్కృతిక, ప్రగతిదాయక గుర్తింపును తీసుకువచ్చిన తీరొక్కటే ఒక ఎత్తు. ఇన్నీ్‌సపేటలో 1881లో బాలికల పాఠశాలను వీరేశలింగం స్థాపించారు. ఆనందగార్డెన్స్‌లోని ముద్రణాలయంలో పత్రికలు, ఆయన సాహిత్యం అచ్చయ్యేవి. భార్య రాజ్యలక్ష్మి పేరుతో ఆయన ఎస్‌కేఆర్‌ ఉమెన్స్‌ కాలేజీలో వందలాది మంది చదువుకుంటున్నారు. రాజ్యలక్ష్మి మరణం ఆయనను బాగా కుంగదీసింది. ఆ తరువాత ఆయన మద్రాస్‌ వెళ్లిపోయారు. 1919 మే 27న అక్కడే కన్నుమూశారు. ఆయన కోరిక మేరకు రాజమహేంద్రవరం ఆనందగార్డెన్స్‌లోని ఆయన భార్య సమాధి పక్కనే ఆయన చితాభస్మాన్ని ఉంచి స్మారక స్థలిని ఏర్పాటు చేశారు.
- రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి