చిక్కడపల్లి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): స్త్రీ పాత్రల్లో రంగస్థల అగ్రనటుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి అని తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. ఇటీవల మరణించిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి సంస్మరణ సభను త్యాగరాయగానసభలో మంగళవారం గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణమోహనరావు మాట్లాడుతూ రంగస్థలంపై విభిన్న పాత్రలతో, వైవిధ్య నటనారీతులను ప్రవేశపెట్టి నటుడిగా సుబ్రహ్మణ్యశాస్త్రి చేసిన కృషి విశేషమైనదన్నారు. సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి పాత్రధారణలతో రంగస్థలాన్ని రక్తి కట్టించారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైౖర్మన్‌ బి.శివకుమార్‌, రంగస్థల నటుడు రత్నశాస్త్రి, సుజారమణ, కిన్నెర రఘురామ్‌ పాల్గొన్నారు.