అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెబుతుంటే ఊ...కొట్టే రోజులు గుర్తున్నాయా? నేటి కంప్యూటర్‌ యుగంలో ఆ సంస్కృతి పూర్తిగా కరువైంది. న్యూక్లియర్‌ కుటుంబాలు వచ్చిన తర్వాత ఇళ్లల్లో తాతలు, నానమ్మ, అమ్మమ్మలు ఉండటం లేదు. అందుకే పిన్నల్ని, పెద్దల్ని ఆకర్షించే.. మన సంస్కృతీ వారసత్వాన్ని అద్దంపట్టే... ‘ఆర్ట్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌’ను పునరుద్ధరించాలని ఢిల్లీకి చెందిన ఫౌజియా దస్తాంగో పూనుకున్నారు.

ఆర్ట్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌ గురించి నేటి తరంలో ఇష్టం పెంచడానికి ఫౌజియా సంకల్పిచారు. చిన్నతనం నుంచి కథలు చెప్పే అలవాటున్న ఫౌజియా పెద్దయిన తర్వాత కూడా ఆ కళను వదల్లేదు. ఆర్ట్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌ విభాగంలో మాస్టర్స్‌ పట్టా తీసుకున్నారు. అంతటితో ఆగలేదు. దాన్నే తన వృత్తిగా మలచుకున్నారు. పురుషాధిపత్య రంగంలో పనిచేస్తూ ఆర్ట్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌ కళపై మంచి పట్టు సాధించి ఎంతోమంది చేత శభాష్‌ అనిపించుకున్నారు. కథలను పైకి చదివే క్లాసులకు హాజరవడం వల్లే ఫౌజియాలో స్టోరీటెల్లింగ్‌పై మక్కువ ఏర్పడింది. ఫౌజియా తండ్రి పాత ఢిల్లీలో మెకానిక్‌గా పనిచేస్తాడు. చిన్నతనంలో తన తోటి పిల్లలంతా ఇంగ్లిష్‌ భాషను శ్రద్ధగా నేర్చుకుంటుంటే ..ఫౌజియా మటుకు ఉర్దూను శ్రద్ధగా చదివేవారు. ఎందుకంటారా... ఉర్దూ నేర్చుకుంటే ఆ భాషా సాహిత్యాన్ని బాగా చదవచ్చని ఫౌజియా భావించారు. అంతేకాదు హిందీలో కూడా మాస్టర్స్‌ పట్టా తీసుకున్నారు.
 
‘హిందీ, ఉర్దూ భాషల్లో అద్భుతమైన సాహిత్య సంపద దాగుంది. అందుకే ఈ రెండు భాషలంటే నాకు ఎంతో ఇష్టం’ అన్నారు ఫౌజియా. స్టోరీ టెల్లింగ్‌ను (దస్తాంగో) చేపట్టడానికి ముందు ఫౌజియా ‘స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌’లో పనిచేసేవారు. ‘మంచి జీతం, సమాజంలో ఎంతో గౌరవాన్ని ఇచ్చే లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదిలి నేను స్టోరీ టెల్లర్‌ కావాలనుకోవడం మా అమ్మకు మింగుడుపడలేదు. కానీ... నాకు అండగా నా చిన్నతమ్ముడు నిలబడ్డాడు. అమ్మానాన్నలు కూడా నా కిష్టమైన పనినే చేసుకోమన్నారు’ అని చెప్పారు. ఫౌజియా ఈ రంగంలోకి వచ్చి తొమ్మిదేళ్లయింది.
 

ఇప్పుడు ఆమె దేశంలోనే తొలి మహిళా దస్తాంగోగా పేరు తెచ్చుకున్నారు. ‘మొదట్లో నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. నాకు థియేటర్‌ అనుభవం కూడా లేదు. వాయిస్‌ ట్రైనింగ్‌ లేదు. అయితే, అదృష్టమేమిటంటే ఏడేళ్లపాటు నేను మెహబూబ్‌ ఫరూకీ దగ్గర పనిచేశాను. అది నాపై ఎంతో ప్రభావం చూపింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది’ అని ఫౌజియా తెలిపారు. పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి ఫౌజియా చాలానే కష్టపడింది. బురఖా వేసుకోకుండా వచ్చినందుకు ఆమెపై ఎందరో విమర్శలు గుప్పించారు. శ్రోతలను మాటలతో అలరించగల చాకచక్యం తన వృత్తిలో ఎంతో ముఖ్యమంటారామె. వ్యక్తిత్వం, శరీర కదలికలు కూడా ప్రముఖపాత్ర వహిస్తాయిని తెలిపారు.

ఫౌజియాలోని విశేషం ఏమిటంటే కథను మనసుకు హత్తుకునేలా, కనులకు కట్టేలా చెప్తారు. ఇస్మాత చుగ్తాయ్‌ ‘నాన్హి కి నాని’ కథ చెప్పేటప్పుడు శ్రోతలు కంటనీరు పెట్టుకోవడాన్ని తను మర్చిపోలేనంటారామె. ఆమె చెప్పే కథల్లో హాస్యం కూడా ఉంటుంది. వీటితో పాటు సీరియస్‌ కథలను కూడా ఫౌజియా చెప్తారు. మహాభారతం నుంచి మహాత్మాగాంధీ జీవితం వరకూ అన్నింటిలోని పాత్రల మాటలకు తగ్గ భావాన్ని గొంతులో వొలికిస్తూ కథను నాటకీయంగా చెప్పడంలో ఫౌజియా దిట్ట. ఆర్ట్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌పై యువతలో ఆసక్తిని పెంచడానికి కాలేజీల్లో, స్కూళ్లల్లో వర్కుషాపులను నిర్వహిస్తున్నారు కూడా. ‘టెక్నాలజీని విపరీతంగా వాడడం వల్ల ఒకప్పటి మన దేశ అద్భుత కళ తెరమరుగవుతోంది’ అని ఆమె వాపోయారు. మూడేళ్ల వయసు పిల్లలకు కూడా కథలు పైకి చదివి వినిపించాలంటారామె. ఇది చిన్నారి మెదడును సృజనాత్మకంగా మలుస్తుందంటారు.