సనత్‌నగర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మహానటుడు ఎస్వీ రంగారావు అని, ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించిన రావి కొండలరావు అన్నారు. అమీర్‌పేటలోని సారథి స్టూడియోస్‌లో గురువారం దివంగత నటుడు ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకలకు మూడోరోజు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ ఎస్వీ రంగారావుతో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. జకర్తా నగరంలో కీచకుడి పాత్రకు ఉత్తమ ప్రతినాయకుడి అవార్డు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఏకైక నటుడు ఎస్వీఆర్‌ అన్నారు. ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ భారతదేశానికి దశ, దిశ చూపించిన మహా నటుడు ఎస్వీ రంగారావు అన్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కాలంలో ఓ క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టగా ఇంత గుర్తింపు తెచ్చుకోవడం గొప్పవిషయమన్నారు. సీనియర్‌ నటి గీతాంజలి మాట్లాడుతూ సుఖదు:ఖాలు సినిమాలో ఎస్వీఆర్‌తో కలిసి నటించడం ఆనందకరమన్నారు. ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ కారణజన్ముడు ఎస్వీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ఫిలింక్లబ్‌ అధ్యక్షుడు, సారథి స్టూడియోస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, కార్యదర్శి ప్రకా్‌షరెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణ మోహన్‌రెడ్డి, రామారావు, పాల్గొన్నారు. అనంతరం పాతాళభైరవి సినిమాను ప్రదర్శించారు.