రవీంద్రభారతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): వాస్తవాన్ని ఆవిష్కరిస్తూ తన వ్యక్తిత్వాన్ని కవిత్వం ద్వారా చాటిన అద్భుతమైన కవి నందిని సిధారెడ్డి అని ప్రముఖ కవి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కారగ్రహీత కె.శివారెడ్డి అన్నారు.  సిధారెడ్డి కవిత్వానికి కానుక ‘తెలంగాణ నాగేటి చాళ్లు’ పుస్తకమని అన్నారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ పద్య కవి ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన ‘తెలంగాణ నాగేటి చాళ్లు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకం నందిని సిధారెడ్డి కవిత్వంపై రచించబడింది. అతిథులుగా కె.శివారెడ్డితో పాటు సీఎం ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, మిట్టకంటి మధుసూదన్‌రెడ్డి, బాల శ్రీనివాసమూర్తి, ఎస్‌.రఘు తొలి కృతిని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా కె.శివారెడ్డి మాట్లాడుతూ ఈతరం కవులకు సిధారెడ్డి ఆదర్శప్రాయుడని అన్నారు. దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ శ్రామిక భాషను వాడుతూ కవిత్వం రాసిన గొప్ప కవి సిధారెడ్డి అని, ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఇలాంటి పుస్తకం తీసుకురావడం అభినందనీయమన్నారు. చివరగా స్పందించిన నందిని సిధారెడ్డి తన కవిత్వంపై అనుమాండ్ల భూమయ్య పుస్తకం రచించడం ఆనందంగా ఉందని అన్నారు. అనుమాండ్ల భూమయ్య అక్షరతపస్వి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు రచయితను అభినందించారు.