చిక్కడపల్లి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు సాహిత్యమంతా వచ్చేనెలలో నాలుగు రోజులపాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చించబడుతుందని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు అన్నారు. సాహితీ సవ్యసాచి, ఐఏఎస్‌ శిక్షణానిపుణులు డాక్టర్‌ ద్వా నా శాస్త్రి రచించిన ‘తెలంగాణ ప్రాచీన కవిత్వం’ ఆవిష్కరణ సభ బుధవారం సాయంత్రం త్యాగరాయగానసభలో ద్వానా సాహితీ కుటీరం, గానసభ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా బీఎస్‌ రాములు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం ఉంటుందన్నారు. ద్వానా శాస్త్రికి కూడా ఆహ్వానం ఉంటుందన్నారు. కృష్ణాజిల్లా సాహితీవేత్తలను కూడా మొన్న కలిసి ప్రపంచ తెలుగుమహాసభలకు ఆహ్వానించామన్నారు. ద్వా నా శాస్త్రి సాహితీకృషికి ఎల్లలు లేవన్నారు. 20 సంవత్సరాలుగా తెలంగాణా సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న అక్షర తపస్వి అని అభినందించారు. ఈ సందర్భంగా ద్వానా శాస్త్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రాచీన కవిత్వంపై పోటీపరీక్షలకోసం ఎవరూ రాయలేదని, ఏ రచన చేసినా రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని రాయాలన్నారు. పోటీపరీక్షలకు వెళ్ళేవారికి ఏమేరకు తెలంగాణ సాహిత్య చరిత్రపై అవగాహన ఉండాలనే దృష్టితో ఈ రచన చేశానన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి పాఠాలు చెప్పాలనుకుంటే నేడు ఆవిష్కృతమైన గ్రంథం చదవాల్సిందేనన్నారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘు పుస్తకాన్ని పరిచయం చేస్తూ ద్వా నా శాస్త్రి తెలంగాణ ఉద్యమంలో మమేకం చెందారన్నారు. తెలంగాణ ప్రాచీన కవిత్వం పుస్తకాన్ని యువతకోసం, విద్యార్థుల కోసం రాశారన్నారు. ఈ సమావేశంలో ప్రగతి పబ్లికేషన్స్‌ ప్రచురణకర్త పి.రాజేశ్వరరావు, బడేసాబ్‌ తదితరులు పాల్గొన్నారు.