రవీంద్రభారతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు అన్నారు. తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ప్రజానికానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడని అభివర్ణించారు. సోమవారం రవీంద్రభారతి పైడి జైరాజ్‌ థియేటర్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దక్కన్‌ టాకీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో చేరన్‌ రూపొందించిన తెలంగాణ కాలజ్ఞాని డాక్యుమెంటరీ సీడీ, పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది.

 జయశంకర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్‌ రాములుతో పాటు జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాష్‌, బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ డా.తిప్పర్తి యాదయ్య, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు హాజరై తెలంగాణ కాలజ్ఞాని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఎస్‌ రాములు మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరచడంలో జయశంకర్‌ సారుది కీలకపాత్ర అని అన్నారు.

దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌ తనకు అత్యంత ఆప్తులని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. వి.ప్రకాష్‌ మాట్లాడుతూ మహోన్నత వ్యక్తి జయఽశంకర్‌ అని అభివర్ణించారు. సభకు ముందు తెలంగాణ కాలజ్ఞాని డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం చేరన్‌ను అతిథులు ఘనంగా సత్కరించారు.