18-03-2018: తెలుగు సాహిత్యం తిరిగి బతకడానికి విదేశీయుడైన ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ కారణం. మన భాషకి ఆయన చేసిన సేవలో లక్షో వంతయినా మనం చేస్తే చాలు. 19వ శతాబ్ది నాటికి తెలుగు రచనలు అక్కడక్కడ విసిరేనట్లుండేవి. ఆ తాళపత్రాలకు రాతప్రతులు, ముద్రణలు సమకూర్చాడు సీపీ బ్రౌన్‌.తిప్పాభట్ల వేంకటశివశాస్త్రి తొలిసారి తాళపత్రాల్లో ఉన్న వేమన పద్యాల్ని బ్రౌన్‌కి అందజేశారు. వీటిని బ్రౌన్‌ చదివి ఆంగ్లంలోకి తానే తర్జుమా చేయాలనుకొన్నాడు. అందుకు తెలుగు- ఆంగ్ల నిఘంటువు అవసరమైంది.బ్రౌన్‌ పుట్టింది కలకత్తాలో, 1798లో. తండ్రి డేవిడ్‌- ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి. బెంగాలీయుల మధ్య పెరగడం వల్ల, అప్పటికి భారత్‌లో పర్షియన్లు- అరబిక్‌ ప్రజలు ఉండటం వల్ల- ఈ మూడు భాషలు బ్రౌన్‌కి బాల్యం నుంచే వచ్చు. మరో వైపు గురువుల దగ్గర సంస్కృతం నేర్చుకొన్నాడు. బ్రౌన్‌కి 14 ఏళ్ల వయసులో తండ్రి మరణించాడు. ఆయన ఉద్యోగం పిల్లలకు ఇవ్వడం ఆనాటి కంపెనీ నియమం. అందుకోసం బ్రౌన్‌ కొంత తర్ఫీదు పొందాలి. ఈ నిమిత్తం- తల్లి ఫ్రాన్సిస్‌ కౌల్‌తో కలిసి 1812లో ఇంగ్లండ్‌ పయనమయ్యాడు. 

లండన్‌లోని హెయిలీబరీ కాలేజీలో చదివాడు. తిరిగి 1817లో భారత్‌లో కాలుమోపాడు. అదనపు శిక్షణ కోసం మద్రాస్‌లోని సెయింట్‌ జార్జి కోట కాలేజీలో చేరాడు. అక్కడ ప్రాంతీయ భాషగా తెలుగును ఎంచుకొన్నాడు. 19 ఏళ్ల వయసులో తొలిసారి తెలుగు అక్షరాల్ని దిద్దాడు. అపురూపంగా అ...ఆలు నేర్చుకొన్నాడు. మురిసిపోయాడు. పులకించిపోయాడు. ఆనాడు బ్రౌన్‌తో అక్షరాభ్యాసం చేయించినవారు- వెలగపూడి కోదండరామయ్య.కాలేజీ శిక్షణ పూర్తయ్యాక బ్రౌన్‌కి ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్‌ కడపలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, ఆపైన బందరు బదిలీ, ఎక్కడ పనిచేసినా ఆయన దినచర్య ఒకటే. స్థానికులకు బెంగాలీ నేర్పడం, వారి నుంచి తెలుగు నేర్చుకోవడం పుస్తకాలు విపరీతంగా చదవడం. ఇంతే! ఒకసారి ఏకంగా ఆరువారాలు సెలవుపెట్టి మచిలీపట్నం నుంచి చెన్నపట్నం వెళ్లాడు- కేవలం కొత్త పాత పుస్తకాలు తీసుకొందామని. అప్పుడు కొన్న ఓ పుస్తకం- ‘హిందువుల మతాచారాలు’. దీని రచయిత ఫ్రెంచి ఉద్యోగి అబే దుబాయ్‌. అందులోని వేమన గురించి రాసిన విషయాలు బ్రౌన్‌ని ఆలోచింపజేశాయి. వేమన పద్యాల్ని సేకరించాలని నిశ్చయించుకొన్నాడు.