అమరావతి: శ్రీకృష్ణదేవరాయల స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుభాషా బ్రహ్మోత్సవాల నిర్వహణకు కృషి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో రెండురోజులుగా జరుగుతున్న తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2018ని సీఎం చంద్రబాబు తెలుగుభాషా సంవత్సరంగా ప్రకటించారన్నారు. భాషాభివృద్ధిని ముందుకు నడిపే బాధ్యత మండలి బుద్ధప్రసాద్‌పై పెట్టారన్నారు. కొండపల్లి ఖిల్లాలో జరిగే తెలుగుభాషా మహోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నట్లు తెలిపారు.దివిసీమ చరిత్రను భావితరాలకు అందించేందుకు మండలి బుద్ధప్రసాద్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

జిల్లా చరిత్రను రూపొందించి అందించాలని సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు సూచించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగుభాష, తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి రాయలవారన్నారు. రాయలవారి అడుగు జాడల్లో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దానిలో భాగంగానే కూచిపూడి నృత్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కొంతమంది వల్ల సాహిత్యం, కళలు బతుకు తున్నాయన్నారు. ప్రముఖ సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడు తూ శ్రీకృష్ణదేవరాయల యోగ్యత గొప్పదైనందునే శ్రీమహావిష్ణువు రాయల వారిని కావ్యం రాయమని ఆదేశించారన్నారు.