జస్టిస్‌ రామలింగేశ్వరరావు

విజయవాడ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాల్లో మాతృభాష తెలుగుకు అన్యాయం జరగకూడదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు అన్నారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడ బార్‌ కార్యాలయంలో ఆదివారం న్యాయస్థానాల్లో తెలుగు వినియోగం కోసం ఉద్యమ సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సభలో జస్టిస్‌ రామలింగేశ్వరరావు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రభుత్వాల పాలన పూర్తిగా తెలుగులో సాగనప్పుడు న్యాయస్థానాల్లో మాత్రం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో న్యాయపదకోశాన్ని రూపొందించాలన్నారు.