ఆంధ్రజ్యోతి, 02-11-2018: మెల్‌బోర్న్ నగరంలో నవంబర్ 3, 4 తేదీల్లో ప్రపంచ సాహితీ సదస్సు జరగనున్నది. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ స్థాయిలో కేవలం తెలుగు సాహిత్యానికే ప్రాముఖ్యత ఇస్తూ ఒక సదస్సు జరగడం ఇది మొదటి సారి.ప్ర

పంచంలో ఏ దేశానికి వెళ్లినా నాకు అత్యంత ఆశ్చర్యం, ఆనందం కలిగించే విషయం ఏమిటంటే అక్కడ తెలుగువారు తమ సంస్కృతీ సాహిత్యాలకు పెద్ద పీటవేయడం, ఆరణాల తెలుగు మర్యాదల్ని పాటించడం. అమెరికా, ఆస్ట్రేలియా, యుకె, న్యూజిలాండ్ మారిషస్, మలేషియా, ట్రినిడాడ్, దక్షిణాఫ్రికా ఎక్కడకు వెళ్లినా తెలుగువారు తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకుంటూ, అక్కడి వారికి దాని ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నారు. తెలుగుపై విదేశాల్లో తెలుగువారికి ఎంత ప్రేమ ఉన్నదంటే అక్కడ హిందీ సినిమాలకంటే తెలుగు సినిమాలు బ్రహ్మండంగా విజయవంతం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పట్టణంలో నవంబర్ 3, 4 తేదీల్లో ప్రపంచ సాహితీ సదస్సు జరగడం ఒక విశేష పరిణామం. ఆస్ట్రేలియా ఖండంలో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కేవలం తెలుగు సాహిత్యానికే ప్రాముఖ్యత ఇస్తూ ఒక సదస్సు జరగడం ఇది మొదటి సారి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీని కట్టా, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. వంగూరి చిట్టెం రాజు సంచాలకులుగా; తెలుగుమల్లి వ్యవస్థాపకులు రావు కొంచాడ ప్రధాన సమన్వయకర్తగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడుగా నేను పాలుపంచుకోవడం, నాతో పాటు ఆస్ట్రేలియన్ సాహితీ సమాఖ్య అధ్యక్షుడు సారథి మోటమర్రి, హ్యూస్టన్ నుంచి శాయి రాచకొండ, భారత దేశ సమన్వయకర్త వంశీ రామరాజు గౌరవ సలహాదారులుగా పాల్గొనడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మూడు సంస్థలు తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషి జగద్విదితం. ఆంజనేయుడు సంజీవని పర్వతం కోసం దశదిశలా వెదికినట్లు నేను ప్రపంచ దేశాలన్నిటిలో ఎక్కడ తెలుగు సువాసనలు గుబాళించినా అక్కడకు వెళ్లగలగడం నాకు ఆనందం కలిగించే విషయం.

ఈ ఆరవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆస్ట్రేలియానుంచే కాక, న్యూజిలాండ్, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాలనుంచి, భారత దేశం నుంచి భాషాభిమానులు, సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు సుమారు యాభై మంది వక్తల ఆసక్తికరమైన సాహిత్య ప్రసంగాలు, నాలుగు దేశాల రచయితల పలు గ్రంథాల ఆవిష్కరణలు, ఆస్ట్రేలియాలో తొలి సారిగా ‘శతావధాన శేఖర’ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి ‘అచ్చ తెనుగు అవధానం’, ఆస్ట్రేలియా తెలుగు సాహితీవేత్తల్లో అర్హులైన పెద్దలకి జీవన సాఫల్య పురస్కారం, 30 మంది మలేషియా ప్రతినిధుల ప్రత్యేక కార్యక్రమం, ప్రపంచ ప్రతినిధుల ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు ప్రత్యేకంగా రూపొందించిన ‘జన రంజని’ వినోద కార్యక్రమం, మెల్‌బోర్న్‌లో బాల బాలికలకు స్వచ్ఛందంగా తెలుగు నేర్పుతున్న 15 మంది ఉపాధ్యాయులకి కృతజ్ఞతా పూర్వకంగా చిరు సత్కారం మొదలైన అనేక కార్యక్రమాలు ఈ సదస్సులో జరుగుతాయి. ఆస్ట్రేలియా తెలుగువారి ప్రస్థానం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రచయితల రచనలతో కవితాస్ట్రేలియా వంటి పుస్తకాలు కూడా ఆవిష్కరిస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ కవి అప్పరసు కృష్ణారావు (కృష్ణుడు), సాహితీవేత్తలు ఎస్.వి. సత్యనారాయణ, ఆకెళ్ల రాఘవేంద్ర, శాంతి ప్రభోధతో పాటు ఎందరో ప్రవాసాంధ్ర రచయితలు ఈ సదస్సులో పాల్గొంటుండం విశేషం. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే విదేశాల్లోనే ఇవాళ కొత్త కవులు, కథా నవలా రచయితలు బయలుదేరుతున్నారు. ఔత్సాహికంగా రచనలు చేసి తమ సంకలనాలు ప్రచురిస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఇలాంటి సాహితీ సదస్సులు ఎంతో ఉపయోగ పడుతున్నాయి.