ప్రచురణలు, కోర్టు తీర్పులు, సంస్థల పేర్లన్నీ తెలుగులోనే
భాషోద్ధరణలో ముందడుగు
ప్రత్యేకంగా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
భాషకు పునరుత్తేజం, విశ్వవ్యాప్తి లక్ష్యంగా కార్యాచరణ
ఉన్నతాధికారులకు తెలుగులో శిక్షణ
‘పలుకు’బడిపై ఉద్యోగులకు పరీక్షలు
 
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తేనెలొలుకు తెలుగు మరింత తీయదనాన్ని అద్దుకోనుంది. ప్రాచీనతకు ప్రాకారంగా నిలిచిన మాతృభాషలోనే ఇకముందు పరిపాలన జరగనుంది. ప్రభుత్వ ప్రచురణలు మొదలు ఉన్నతాధికారులకు శిక్షణ దాకా తెలుగులోనే సాగనున్నాయి. నవ్యాంధ్రలో తొలినుంచీ తెలుగుకు పట్టం కడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘‘ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ బోర్డుని ఏర్పాటుచేసింది. తాజాగా ఈ బోర్డు పరిధిలోనే ‘ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాషాభివృద్ధి సంస్థ’కు ప్రభుత్వం జీవం పోసింది. ఈ మేరకు పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంస్థ విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి.. తెలుగు భాషను ఎలా అభివృద్ధి చేస్తారు..ముఖ్యంగా ప్రభుత్వ పాలనలో తెలుగు భాష పరిధిని ఏ స్థాయిలో పెంచుతారనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది. తెలుగు భాషకు పునరుత్తేజం, విశ్వవ్యాప్తే ధ్యేయంగా ఏర్పాటు అయిన ఈ సంస్థ చైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. సాధారణ పరిపాలన, న్యాయ, కార్మిక, పర్యాటక, విద్యాశాఖ కార్యదర్శులు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. తెలుగు సాహిత్యం, పరిపాలన, చట్టం వంటి అంశాల్లో నిపుణులైన నలుగురిని సభ్యులుగా నియమిస్తారు. సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఈ సంస్థ పాలనా వ్యవహరాలను పర్యవేక్షిస్తారు. ఈ సంస్థ కింద ఐదు కమిటీలు పని చేస్తుంటాయి. భాషకు పునరుత్తేజం కలిగించేందుకు కృషి చేస్తాయి. తెలుగు అమలు కమిటీ, ‘ఈ - తెలుగు’ కమిటీ, అభివృద్ధి, ప్రచురణలు కమిటీ, అనువాదం కమిటీ, అంతర్జాతీయ భాషాభివృద్ధి కమిటీల పేరిట వీటిని ఏర్పాటు చేస్తారు.
 
పూర్తి ‘అధికార’ ముద్ర కోసం..
అధికార భాష అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించడం కోసం ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రభుత్వపరంగా ప్రజలు వినియోగించే ప్రతి దరఖాస్తు, రికార్డును తెలుగులో అందుబాటులో ఉంచటంపై దృష్టి సారిస్తుంది. న్యాయ స్థానాలు వెలువరించే తీర్పులు కూడా తెలుగులో ఉండేలా చూడాలనేది ప్రభుత్వం అభిలాష. అయితే, న్యాయవ్యవస్థలో వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు పని చేస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, వారికి తెలుగు భాషపై మరింత పట్టు సాధించేలా శిక్షణ, సదస్సులు, ప్రదర్శనలను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. పాలనా విధులు నిర్వహిస్తున్న చాలా మంది ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. సుదీర్ఘకాలంగా ఏపీలో పని చేస్తున్నందు వల్ల, వారిలో కొంతమంది తెలుగు మాట్లాడగలుగుతారు. అయితే, వారి భాషా పరిజ్ఞానం తెలుగులో విధులు నిర్వహించేందుకు ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకమే. దీంతో ఆ అధికారులకు తెలుగుపై ఉన్న పట్టు ఎంత అన్నదానిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను కూడా తెలుగు భాషాభివృద్ధి సంస్థకు అప్పగించింది. అలాగే, రాష్ట్రంలో ఉన్న కేంద్ర సంస్థల్లో కూడా తెలుగు అమలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
 
సంస్థలకు, కార్యాలయాలకు తెలుగు పేర్లు
విమానాశ్రయాలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇలా అన్నింటా తెలుగు కనిపించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక కృషికి గ్రామ సచివాలయం నుంచి శ్రీకారం చుట్టి, తాలూకా, జిల్లా స్థాయికి విస్తరిస్తారు. శాసనసభ వ్యవహరాలకు సంబంధించిన అన్ని అంశాలు తెలుగులోనే ఉండేలా ప్రత్యేక కార్యాచరణ అమలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న అన్ని పదాలకు తెలుగులో పదకోశాన్ని సిద్ధం చేస్తారు. ప్రభుత్వ పరమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలతో పాటు అన్ని రకాల నామ ఫలకాలు, గోడపత్రికలు, జెండాలు తయారీలోనూ తెలుగుదనం ఉట్టిపడనుంది. ప్రభుత్వ పరమైన ప్రచురణలు అన్ని విధిగా తెలుగులోనే ఉంటాయి. అలాగే, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తారు. భాష అనేది అభ్యాసం ద్వారా అలవడుతుంది. అందులో భాగంగా విద్యకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా నిబంధనలు రూపుదిద్దుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య విషయాల్లో ప్రాధాన్యం, తెలుగు పాఠ్యపుస్తకాల స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించటం, ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థుల అభ్యాసన స్థాయిలను పరిశీలించటం వంటివి చేస్తారు. ప్రధానంగా తల్లిదండ్రులను ఈ క్రమంలో చైతన్య పరచటం, తెలుగేతర విద్యార్థులు తెలుగు నేర్చుకునేలా శిక్షణా తరగతులు, వివిధ సందర్భాల్లో కవులు వాడిన పదాలను ప్రచారంలోకి తీసుకువస్తారు. భాషను కాపాడుకోవాల్సిన అవసరంపై యువతను చైతన్య పరుస్తూ, వారికి పోటీలు, సదస్సులు, కార్యశాలలు నిర్వహిస్తారు. తెలుగు భాష, సంస్కృతిపై పరిశోధన చేసే వారిని ప్రోత్సహించటం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ తెలుగు మహా సభలకు నిర్వహించనున్నారు.
 
డిజిటల్‌లో మన పలుకు
డిజిటల్‌ యుగంలో తెలుగును అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపచేయాలంటే, అదే విధానంలో భాషను ముందుకు తీసుకువెళ్లవలసి ఉంది. ఈ క్రమంలోనే ’ఈ - తెలుగు’ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటయింది. సైకాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు, చరిత్ర, వైద్యం వంటి రంగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని డిజిటల్‌ పదకోశంలో అందుబాటులో ఉంచుతారు. ఇంటర్నెట్‌లో తెలుగు వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇక.. అన్‌లైన్‌లో తెలుగు బోధన చేపడతారు. ప్రాధికార సంస్థ వెబ్‌సైట్‌లో తెలుగు సంగీతం, పురాతన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలను డిజటలీకరించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ పరమైన వ్యవహారాలన్నింటికి యూనికోట్‌ అందుబాటులోకి తీసుకువచ్చి, సమాచారాన్ని అదే రూపంలో భద్రపరచటం వంటి పనులు చేయనున్నారు. విదేశీ భాషల్లో ఉన్న అత్యున్నత సమాచారంతో పాటు సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలను అనువాదం చేసి అందరికీ అందుబాటులో ఉంచుతారు. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగించాలని నిబంధన ఏర్పాటు చేశారు.
 
పొరుగు రాష్ట్రాలతో సమన్వయం..
తెలుగు ప్రజలు ఉన్న రాష్ట్రాల్లో విద్యాభోధన తెలుగులో సాగేలా అక్కడి పాలకులతో సమన్వయం చేసుకొంటారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా మూడో భాషగా తెలుగు ఉండేలా ప్రయత్నిస్తారు. సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఉన్న గ్రామాల్లోని తెలుగు ప్రజల కోసం భాషపరమైన ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.
 
కొసమెరుపు
తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘‘తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ’’ను ఏర్పాటు చేసింది. కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులను మాత్రం ఆంగ్లంలో విడుదల చేయడం కొసమెరుపు.
 
మాట తప్పితే వేటే..
‘‘తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రాధికార సంస్థకు జీవం పోశారు. పరిపాలనలో తెలుగు అమలు, వినియోగంపై కాలపరిమితితో కూడిన నిబంధనావళి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో తెలుగు భాషాభివృద్ధి నిధి పేరిట రూ.25 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో దుకాణదారులు తెలుగులో నామఫలకాలను ఏర్పాటు చేయకపోతే రూ.50 వేల వరకు జరిమానా వసూలుచేస్తాం. శిలాఫలకాలు, గోడపత్రికల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెలుగు వినియోగించాలి. లేకుంటే రూ.10 వేలు జరిమానా తప్పదు. నిబంధనల మేరకు తెలుగుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు రూ.5 వేలు అపరాధరుసుం విధిస్తాం. విద్యాసంస్థల నిర్వాహకులు తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే రూ.50 వేలు జరిమానా, ఆరునెలల జైలు శిక్ష తప్పదు.
- ముఖేశ్‌ కుమార్‌ మీనా, ముఖ్య కార్యదర్శి,
పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ