నెల్లూరులో ప్రాచీన భాష అధ్యయన కేంద్రం

మైసూరు నుంచి తరలిస్తూ కేంద్రం ఉత్తర్వులు

విజయదశమి నాడు ఆవిర్భావం
ఇద్దరు తెలుగు సీఎంలకూ ఆహ్వానం
ఫలించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య కృషి
ఏర్పాటుచేసే ప్రాంతంపై నేడు నిర్ణయం?

నెల్లూరు/న్యూఢిల్లీ/అమరావతి (ఆంధ్రజ్యోతి): దశాబ్ద కాలంగా తెలుగువారు కంటున్న కల నెరవేరింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎట్టకేలకు తెలుగు గడ్డపై ఏర్పాటు కాబోతోంది. దాదాపు 11 ఏళ్ల క్రితం మైసూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివెనుక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి ఎంతో ఉంది. దేశంలోని భాషల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని మైసూరులో 1969లో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజె్‌స(సీఐఐఎ్‌స)ను ఏర్పాటు చేసింది. 2004లో తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించింది. 2008 అక్టోబరు 31న తెలుగు, కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలుగా గుర్తించింది. ప్రాచీన హోదా కల్పించిన వెంటనే తమిళ, తెలుగు, కన్నడ భాషల అధ్యయనానికి సీఐఐఎల్‌లోనే భాషల వారీగా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే తమిళనాడు రాష్ట్రం తమ భాష అధ్యయన కేంద్రాన్ని వెంటనే స్వరాష్ట్రానికి తరలించుకుపోగా.. కర్ణాటక కూడా తమ అధ్యయన కేంద్రాన్ని వేరే అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంది. తెలుగు భాష అధ్యయన కేంద్రం మాత్రం ఇప్పటికీ మైసూరు సీఐఐఎల్‌లోనే కొనసాగుతోంది. 11 ఏళ్ల నుంచి ఈ కేంద్రాన్ని సొంత గడ్డకు తరలించాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటవడంతో అధ్యయన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది తేలక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పక్కనపెట్టింది. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడి చొరవతో నెల్లూరుకు దీనిని తరలించేందుకు అంగీకరించింది. ఈ మేరకు గత నెల 29న ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఉన్నతాధికారులతో ఉపరాష్ట్రపతి చర్చలు..
ప్రాచీన భాష కేంద్రాన్ని నెల్లూరుకు తరలించడంపై ఉపరాష్ట్రపతి స్వయంగా కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. వ్యక్తిగత స్థాయిలో ప్రతి దశలోనూ నిర్ణయాలు తీసుకోవడానికి వెంకయ్య కృషిచేశారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి. ‘గత ఏడాది ఈ కేంద్రానికి 35 పోస్టులను మంజూరు చేశారని.. లైబ్రరీ, పరిశోధనా ప్రాజెక్టులు, వర్క్‌ షాపులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రానికి భవనాన్ని, స్థలాన్ని కేటాయించాల్సిందిగా 2014లో హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తొలుత కోరినప్పటికీ అది ఆచరణ సాధ్యం కాలేదు. ఆంధ్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. దీంతో ఈ కేంద్రం మైసూరులోనే కొనసాగుతోంది. అయితే దీనిని నెల్లూరుకు తరలించడానికి వెంకయ్య చొరవ తీసుకున్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కూడా లేఖ రాయడంతో నిర్ణయం వేగవంతమైంది’ అని పేర్కొన్నాయి. విజయదశమి నాడు ప్రాచీన భాష అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌లను ఆహ్వానించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖే చొరవ తీసుకుంటుందని తెలిపాయి.
 
పరిశోధనలకు మంచి రోజులు..
తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనది. ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. 2009లో తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ మద్రాసు హైకోర్టులో కేసు వేయగా తెలుగు ప్రాచీనమైనదని నిరూపించే అనేక ఆధారాలను అప్పటి ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది. మరోవైపు.. ఇతర భాషలు తెలుగుపై దాడి చేస్తుండడంతో తెలుగు భాష తీయదనం తగ్గుతోంది. నేటి తరం పిల్లలకు తెలుగు విశిష్టత తెలియడం లేదు. ఎంతో గొప్పదైన తెలుగు సాహిత్యానికి గడ్డు రోజులు దాపురించాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష గొప్పదనాన్ని, విశిష్టతను అందరికీ తెలియజేయడం ఒక్కటే మార్గమని సాహితీవేత్తలు, పరిశోధకులు అంటున్నారు.
 
ఇందుకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం వారధి వంటిదని చెబుతున్నారు. అలాంటి కేంద్రాన్ని ఇప్పుడు కవిత్రయంలో మధ్యముడైన తిక్కన సోమయాజి జన్మభూమి అయిన నెల్లూరులో నెలకొల్పితే.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలకు చెందిన తెలుగు పండితులు కూడా అధ్యయనం చేసేందుకు వీలవుతుందని అంటున్నారు. పైగా ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రానికి ఏటా కేంద్రం రూ.కోట్లు కేటాయిస్తోంది. ఈ నిధులతో భాషపై పరిశోధనలు, తెలుగు సాహిత్యానికి ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. ఈ కేంద్రం మైసూరులో ఉండడంతో ఇవన్నీ కొంత మందికే అందుబాటులో ఉండేవి. పరిశోధనలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతుండేవి. ఇప్పుడు తెలుగు గడ్డకే అధ్యయన కేంద్రం తరలివస్తుండడంతో పరిశోధకులకు, సాహితీవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. తెలుగు సంస్కృతి, సాహిత్యం, శాసనాలపై పరిశోధనలు చేస్తారు. ఈ పరిశోధనలకు అవసరమయ్యే నిధులన్నిటినీ కేంద్రమే అందిస్తుంది.
 
ఏర్పాటు ఎక్కడ?
నెల్లూరుకు ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని తరలిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చినా.. నగరంలో దానిని ఎక్కడ ఏర్పాటుచేయాలో ఇంకా ఖరారు కాలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థన మేరకు నెల్లూరులోని ఎన్‌సీఈఆర్‌టీలో ఈ కేంద్రానికి స్థలాన్ని కేటాయించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అంగీకరించింది. కానీ 2016లో ఎన్‌సీఈఆర్‌టీ కేంద్రానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటికీ నిర్మాణం ముందుకు జరగలేదు. ఎందుకంటే భూసేకరణే ఇంకా పూర్తికాలేదు. ఇది త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉపరాష్ట్రపతికి హామీ ఇచ్చారని.. అది పూర్తయ్యేవరకూ అవసరమైతే నెల్లూరులోని స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ప్రాంతంలో భవనాన్ని ఉచితంగా ఇచ్చేందుకు వెంకయ్యనాయుడు ముందుకొచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ లోపు నెల్లూరులోనే ఉన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని బీఎంటీపీసీ (బిల్డింగ్‌ మెటీరియల్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌) భవనం ఖాళీగా ఉందని తెలియడంతో అధ్యయన కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. అక్కడ కుదరకుంటే కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎ్‌సయూ) భవనాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎక్కడ ఏర్పాటు చేసేదీ సోమవారం స్పష్టత వస్తుందని జిల్లా అధికార వర్గాలు అంటున్నాయి.