పరిశోధనలతో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి
నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలుగు చరిత్రకారుడు ఆచార్య రావుల సోమారెడ్డి(75) ఇకలేరు. బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో ఆయన గుండెపోటుతో మరణించారు. సోమారెడ్డి స్వస్థలం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొడకండ్ల. 1960లో ఓయూ చరిత్రశాఖలో అధ్యాపకులుగా చేరి, ఓయూ ఆర్ట్స్‌ కళాశాల డీన్‌, బోర్డ్‌ ఆఫ్‌ చైర్మన్‌, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌ తదితర హోదాలలో పనిచేశారు. ‘‘ఆంధ్రనాట మధ్యయుగం 1300-1700 నాటి చరిత్ర’’, ‘‘ఆంధ్ర నాట మధ్యయుగాల నాటి వర్తకం, వ్యాపారం’’, ‘‘ఆంధ్రనాట మధ్యయుగంనాటి వలసలు’’, ‘‘భారత చరిత్ర రచనలో సమకాలీన ధోరణి’’ తదితర పరిశోధనా గ్రంథాలను రచించారు. 700 ఏళ్ల క్రితమే తెలుగునాట వెలసిల్లిన హిందూ, ముస్లింల మతసామరస్యాన్ని వెలుగులోకి తెచ్చారు. సోమారెడ్డి చరిత్రశాఖ విభాగాధిపతిగా ఉన్నప్పుడు ఆయన వెలువరించిన 12 వార్షిక పరిశోధనా గ్రంథాలను ప్రపంచ దేశాల్లోని 12 ప్రముఖ లైబ్రరీలలో పొందుపరిచారంటే అతిశయోక్తి కాదు. ‘‘చరిత్రను కొందరు సమకాలీన అవసరాలకు అన్వయించి, వక్రీకరిస్తున్న సందర్భంలో ఒక ప్రాంతీయ చరిత్రలో ఇమిడి ఉన్న మత, సాంస్కృతిక, ఆర్థిక అంశాలపై హేతుబద్ధమైన పరిశోధన ద్వారా వాస్తవాలను వెలికితీయడంలో సోమారెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని’’ ఆచార్య అడపా సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం హబ్సిగూడ శ్మశానవాటికలో సోమారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి.