సనత్‌నగర్‌, హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఓ కళాకారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఆయన శత జయంతి వేడుకలు నిర్వహించడం గర్వించదగిన విషయమని, ఇంతకన్నా ఓ కళాకారుడికి ఏం కావాలి అని ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. కళాకారులు అభిమానుల గుండెల్లో జీవిస్తారని, రంగారావు కాలాతీత వ్యక్తి అని, ఆయన జీవితం ఈ తరానికి పాఠం లాంటిదన్నారు. అమీర్‌పేటలోని సారథి స్టుడియోలో బుధవారం దివంగత నటుడు ఎస్వీ రంగారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ దర్శకుడు రేలంగి నర్సింహారావు మాట్లాడుతూ ‘కొత్తకాపురం’ సినిమా నిర్మాణం జరుగుతున్నక్రమంలో ఎస్వీ రంగారావు మృతి చెందారని దీంతో యావత్‌ ప్రపంచం దిగ్ర్భాంతికి గురైందని, ఆయన నటనలో ఓ కీచకుడు, ఓ దుర్యోధనుడు.. ఏ పాత్ర ధరించిన ప్రేక్షకులు నీరాజనం పట్టేవారని, అటువంటి నటుడికి రఘుపతి వెంకయ్య, పద్మశ్రీ అవార్డులు ఇచ్చి వుంటే బాగుండేదని అన్నారు.వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ సావిత్రి బయోపిక్‌ సినిమాలాగే ఎస్వీ రంగారావు జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించి ఈ తరం వారికి తెలియజేయడం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్‌ పీఎన్‌ రాంచందర్‌, హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, కార్యదర్శి ప్రకాష్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణమోహన్‌ రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం... ‘బాంధవ్యాలు’ సినిమాను ప్రదర్శించారు.