రవీంద్రభారతి, మే 11 (ఆంధ్రజ్యోతి): సుమధురమైన రాగాలను పలికిస్తూ సాగిన సంగీత కచేరీ ఆహూతుల్ని మంత్రముగ్దుల్ని చేసింది.  శనివారం రవీంద్రభారతిలో ప్లాన్‌జెరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్లాన్‌జెరి వెంకటాచలం అయ్యార్‌ స్మారక కచేరీ నిర్వహించారు. సంగీత సంగమం శీర్షికన నిర్వహించిన ఈ కచేరీలో అందరూ మహిళలే పాల్గొనడం విశేషం. ప్రఖ్యాత వయోలిన్‌ విద్వాంసురాలు పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి నేతృత్వంలో జరిగిన సంగీత సంగమం కచేరీ శ్రోతల్ని కట్టిపడేసింది. ఇందులో వాణి మంజులత- ఫ్లూట్‌, అశ్విని శ్రీనివాసన్‌- మృదంగం, అనుతమ మురళి- వయోలిన్‌, రత్నశ్రీ- తబల, రమ్య రమే్‌ష-ఘటం, భాగ్యలక్ష్మీ ఎం.కృష్ణ- మోర్సింగ్‌లపై వాద్య సహకారం అందజేశారు. పలు కీర్తనలను తమదైన శైలిలో వాయిస్తూ మైమరిపించారు. ఒకే వేదికపై ఎనిమిది మంది మహిళా కళాకారులు ఒకే సమయంలో వాద్య కచేరీ నిర్వహించడం విశేషం.  ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని కళాకారులను సత్కరించి అభినందించారు.