రవీంద్రభారతి,ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సమాజంలో స్త్రీపాత్ర గొప్పదని ఈ విషయంపై పరిశోధన చేసి పుస్తకరూపం తీసుకురావడం అభినందనీయమని ఓయూ వీసీ రామచంద్రం అన్నారు. నాణ్యమైన పరిశోధన చేసినప్పుడే పుస్తకరూపం దాల్చుతుందని అన్నారు. శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో ఉజ్వల్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ మృణాళినీరాజ్‌ రచించిన పంచ మహాకావ్యాలలో స్త్రీపాత్ర చిత్రణ, అక్షర దీప్తి పుస్తకాల ఆవిష్కరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ ఎస్‌.రామచంద్రం పుస్తకావిష్కరణ చేసి ప్రసంగించారు. ఆనాటి స్త్రీ పాత్రను రచయిత్రి చక్కగా వర్ణించారని అన్నారు. ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్లు వచ్చాక పుస్తక పఠనం తగ్గినట్టుగా కనిపిస్తోందన్నారు.గ్రంథాలయాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గిందని అన్నారు. పరిశోధనా విద్యార్థిని మృణాళినీరాజ్‌ రచించిన తీరు బాగుందని అభినందించారు. సభాధ్యక్షత వహించిన ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ ఆనాటి కాలంలో స్త్రీపాత్రను అద్భుతంగా ఆవిష్కరించారన్నారు.ఈ కార్యక్రమంలో ఓయూ వర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షురాలు సూర్యధనుంజయ్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పత్తిపాక మోహన్‌, దైవజ్ఞశర్మ, ధనుంజయ్‌నాయక్‌, తదితరులు పాల్గొని మృణాళినీరాజ్‌ను సత్కరించి అభినందించారు.