చిక్కడపల్లి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషకు, కవిత్వానికి నిలువెత్తు సంతకం సినారె అని తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. త్యాగరాయ గానసభలో బుధవారం రాత్రి జ్ఞానపీఠ్‌ పురస్కారగ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ద్వితీయ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమోహనరావు మాట్లాడుతూ సాహితీలోకంలో ఎనలేని సేవలు చేసిన గొప్ప వ్యక్తి సినారె అన్నారు. విశ్వంభర కావ్యంతో విశ్వకవిగా ప్రసిద్ధి పొందారన్నారు. తెలుగు, అంబేడ్కర్‌ యూనివర్సిటీల ఉపకులపతిగా, అఽధికారభాషా సంఘం, సాంస్కృతిక మండలి, సారస్వత పరిషత్‌ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన సేవలు అమూల్యమైనవన్నారు. తుది శ్వాస వరకు ప్రతి రోజూ ఒక కవితను వెలువరించిన మహాకవి సినారె అన్నారు. తన సినీ ప్రస్థానంలో పాతతరం, కొత్తతరం, వర్ధమాన నటీనటులకు కొన్ని వేల పాటలను రచించిన ఘనత సినారెకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, కళా జనార్దనమూర్తి, కవి వడ్డేపల్లి కృష్ణ, మురళీధర్‌, సుజారమణ పాల్గొన్నారు. 
 
కవి సినారెది హృదయానికి హత్తుకునే కవిత్వం: ప్రొఫెసర్‌ గౌరీశంకర్‌
సినారె కవిత్వం హృదయానికి హత్తుకుంటుందని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టి.గౌరీశంకర్‌ అన్నారు. శిఖరం ఆర్ట్‌  థియేటర్స్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి త్యాగరాయ గానసభలో సినారె వర్ధంతి సందర్భంగా గానం, నాట్యం, కవనం కార్యక్రమలు జరిగాయి. టీవీ రావు, లలితారావులు సినారె గీతాలను గానం చేయగా, నాట్య గురువు ఎం.రంజని శిష్యులు నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కవులు చిక్కా రామదాసు, వీణారెడ్డి, హన్మంత్‌రెడ్డి కవితలు వినిపించారు. గౌరీశంకర్‌ మాట్లాడుతూ సినారె కవిగా, సినీ గేయ రచయితగా, సాహితీవేత్తగా, పరిపాలనా దక్షుడిగా దేనికదే రికార్డుగా సేవలందించారని, సినారె పొందని పురస్కారం లేదన్నారు. కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ సినారె చేతులమీదుగా ఏర్పాటైన సంస్థలు నేడు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాణిస్తున్నాయన్నారు. ఏబూషి పోషం పటేల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఏబూషి యాదగిరి, నిర్వాహకుడు జి.కృష్ణ పాల్గొన్నారు.