చిక్కడపల్లి, జూన్‌1(ఆంధ్రజ్యోతి): పాట ఎప్పుడూ గడీలకు బందీ కావొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఊరు మనదిరా వాడ మనదిరా గూడ అంజన్న ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ధూమ్‌ధామ్‌ కార్యక్రమం శుక్రవారం రాత్రి సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ ప్రజానాట్యమండలి, ప్రజాకళామండలి, తెలంగాణ సాంస్కృతిక సైన్యం, తెలంగాణజనసమితి, సాంస్కృతిక విభాగం, కలాల గళాల వేదిక, నల్లమల్ల కళాకారుల వేదిక, తెలంగాణ ప్రజా కళాకారుల వేదిక ఆధ్వర్యంలోజరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు.  కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి దన్నుగా నిలిచిన ధర్నాచౌక్‌లు లేవని, ఊరేగింపులు, సభలు, సమావేశాలకు అనుమతుల్లేవని ప్రజాస్వామ్య జేగంటలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పొగిడిన వారికి అందలాలు, ప్రశ్నించిన వారికి సంకెళ్లను వేస్తున్నారన్నారు.  ప్రొ. జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ పాల్కురికి సోమనాథుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు మొదలుకుని ప్రజా వాగ్గేయకారులంతా నిరంతరం ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు.  ఈ కార్యక్రమంలో  విమలక్క, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు నలమాస కృష్ణ, బైరాగి మోహన్‌, సీపీఐ ఎంఎల్‌నేత గోవర్ధన్‌, ఝాన్సీ, ధూమ్‌ధామ్‌ కళాకారులు దరువు అంజన్న నేర్నాల కిషోర్‌, మురళి, రాచకొండ రమేష్‌, నాగరాజు తదితరులతోపాటు 100 మంది కళాకారులు  పాల్గొన్నారు