చిక్కడపల్లి, జూన్‌7(ఆంధ్రజ్యోతి): సంప్రదాయ కళలను అందరూ ప్రోత్సహించాలని వక్తలు పేర్కొన్నారు. సిద్ధేంద్ర ఆర్ట్స్‌ అకాడమీ 36వ వార్షికోత్సవం గురువారం  త్యాగరాయగానసభలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సభా కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, ఐఆర్‌ఎస్‌ అధికారి కె. శివ భాగ్యారావు, పూర్వ ఐపీఎస్‌ అధికారి మల్లెల బాబురావు, అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు డా. నాగార్జున శర్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కళలు మన సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. కళాకారులను ప్రోత్సహించే విషయంలో కళా సంస్థలతోపాటు సామాజిక సేవాసంస్థల కృషి గొప్పదన్నారు. సిద్ధేంద్ర ఆర్ట్స్‌ అకాడమీ నిర్వాహకురాలు డా. దేవసేన ఈ సంస్థ స్థాపించి 36 సంవత్సరాలుగా చేస్తున్న కళా, సాంస్కృతిక సేవ ఎంతో ఆదర్శనీయమైందన్నారు. మన పిల్లలకు చదువుతోపాటు కళల్లో కూడా తర్ఫీదును ఇవ్వడం వల్ల దేశం గర్వించే కళాకారులుగా రూపుదిద్దుకుంటారన్నారు. ఈసందర్భంగా కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు  పాల్గొన్నారు. సభకు ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.