హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): యువ రచయితలు, కవులను ప్రోత్సహించేందుకు వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. డిసెంబరులో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో ఔత్సాహికులైన పలువురు రచయితలు, కవుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల కార్యక్రమాలు, సభలు, సమీక్షలపై ప్రత్యేక సంచికను తయారు చేస్తున్నట్లు వివరించారు.