రవీంద్రభారతి, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్‌రావు రచించిన మహెఫిల్లో కోయిల, కొన్ని నవ్వులు ఏరుకుందామని పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి పుస్తకాలను ఆవిష్కరించారు. కొన్ని నవ్వులు ఏరుకుందామని పుస్తకాన్ని సాహితీవేత్త డా.తిరుమల శ్రీనివాసాచార్యులుకు, మహెఫిల్లో కోయిల పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తుమ్మూరి కవిత్వం కమ్మగా ఉందన్నారు. మహెఫిల్లో కోయిల పుస్తకంలో చక్కటి గజల్‌లను పొందపరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి వ్యవహరించగా, మామిడి హరికృష్ణ, సాహితీవేత్త ద్వానా శాస్త్రి, నాగబాల సురే్‌షకుమార్‌, రమణ వెలమకన్ని, తాళ్లపల్లి మరళీధర్‌గౌడ్‌, డా.పోరెడ్డి రంగయ్య తుమ్మూరి రామ్మోహన్‌రావును అభినందించారు.